ప్రతిపక్షాల దిమ్మతిరగాలి


Sat,September 8, 2018 01:41 AM

కలెక్టరేట్ / సుల్తానాబాద్ రూరల్ /సుల్తానాబాద్ : గత ప్రభుత్వాలు పెద్దపల్లిలో చేసింది శూన్యమనీ, నాలుగేళ్లలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్‌కే మళ్లీ పట్టం కట్టి, ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా తీర్పు ఇవ్వాలని పెద్దపల్లి తాజామాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థిత్వం ఖరారైన హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి వస్తున్న దాసరికి సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వందలాది బైక్‌లతో స్వాగతం పలికారు. ముందుగా అక్కడి హనుమాన్ ఆలయంలో పూజలు చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వచ్చి పెద్దపల్లికి రాత్రి 9గంటలకు చేరుకున్నారు. పెద్దపల్లిలో ర్యాలీ తీసిన తర్వాత జెండా చౌరస్తా వద్ద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో దాసరి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు, నాయకులపై విమర్శలు గుప్పించారు. గతంలో పెద్దపల్లిని పాలించిన ప్రభుత్వాలు గానీ, నాయకులు గానీ ఏనాడూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారనీ, సీట్లు, ఓట్ల కోసం ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ ఉద్యమాల పార్టీ అనీ, పదవుల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందని చెప్పారు. అత్యంత దూరదృష్టితో ముందుకు సాగుతున్న కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలనీ, తనను మళ్లీ ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని కోరారు.

కనీవినీ ఎరుగని అభివృద్ధి..
తెలంగాణలో గత అరవై ఏళ్ల సమైక్య ప్రభుత్వాల పాలనలో జరుగని అభివృద్ధి కేవలం నాలుగేళ్లలోనే చేసి చూపించామనీ, ఎన్నికల్లో మళ్లీ అవకాశం కల్పించి ఆశీర్వదించాలని కోరారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్నింటా అభివృద్ధి చేశామనీ, ఉహించనీ పథకాలు అమలు చేశామని చెప్పిన ఆయన, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక టీఆర్‌ఎస్‌కే ఉందన్నారు. సుల్తానాబాద్‌కు నూతనంగా రూ.10 కోట్లను మంత్రి కేటీఆర్ మంజూరు చేశారనీ, త్వరలోనే పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రూ. 5 కోట్లతో ప్రభుత్వ దవాఖానను అన్ని హంగులతో నిర్మించామనీ, కోర్టు, మండల పరిషత్ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. సుల్తానాబాద్‌లో రోడ్ల అభివృద్ధికి రూ. 80 కోట్ల వెచ్చించామన్నారు. రాజీవ్ రహదారిపై సెంట్రల్ లైటింగ్‌తోపాటు ప్రధాన కూడల్లో హైమాస్ లైట్లను ఏర్పాటు చేసిన ఘనత మాకే దక్కిందన్నారు మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికీ నల్లా నీరందించే పనులు పూర్తవుతున్నాయన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...