ఆశీర్వదించండి..


Fri,September 7, 2018 02:28 AM

- నేడే హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ
- ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న అధినేత కేసీఆర్
- పూర్తయిన ఏర్పాట్లు.. పర్యవేక్షించిన మంత్రులు హరీశ్‌రావు, ఈటల
- జనసమీకరణలో నిమగ్నమైన ప్రజాప్రతినిధులు
- పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు
- ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, ఆహ్వానించిన మహిళా నేతలు
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి/ హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : తనకు అన్ని విధాలా కలిసొచ్చిన గడ్డ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. నాటి ఉమ్మడి జిల్లా.. నేటి సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలకు నేడు శ్రీకారం చుడుతున్నారు. నియోజకవర్గం నుంచి 65వేల మంది తరలిరానుండగా, సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ స్వయంగా పర్యవేక్షించగా, సభకు జాతరలా తరలిరావాలని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. జడ్పీ అధ్యక్షురాలు, ఇతర మహిళా నేతలు ఇంటింటికీ వెళ్లి, బొట్టు పెట్టి ఆహ్వానించారు.

నాటి ఉమ్మడి జిల్లా, నేటి సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో శుక్రవారం జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లూ చేశారు. కలిసొచ్చిన గడ్డ నుంచే సీఎం కేసీఆర్ రెండో సారి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుండగా, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎంపీ వినోద్‌కుమార్, మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, గంగుల కమలాకర్, పుట్ట మధు, రసమయి బాలకిషన్, విద్యాసాగర్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి తదితరులు జనసమీకరణలో నిమగ్నమయ్యారు. రెండు రోజులుగా మండలాలు, గ్రామాల వారీగా ఇంటింటికీ తిరిగి సభకు రావాలని నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే జనాన్ని సభాప్రాంగణానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ రద్దయ్యాక జరిగే తొలిసభ కావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి 65వేల మందిని తరలించాలని మొదట్లో అనుకున్నప్పకిటీ అంతకన్నా ఎక్కువ జనాభాను సభకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు హుస్నాబాద్ సభాస్థలికి హెలీకాప్టర్‌లో సీఎం కేసీఆర్ చేరుకుంటారు. సభ అనంతరం హెలీకాప్టర్‌లోనే తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

వందమంది కూర్చునేలా సభావేదిక..
సుమారు పదెకరాల స్థలంలో సభా స్థలిని సిద్ధం చేశారు. వంద మంది కూర్చునేలా సభావేదికను తీర్చిదిద్దారు. గురువారం సాయంత్రం వరకే సిద్ధం చేశారు. కళాకారుల కోసం ప్రత్యేక వేదికను నిర్మించారు. వేదిక ముందు భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సభకు కుడివైపు వీఐపీల గ్యాలరీ, ఎడమవైపు ప్రెస్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. వేదికకు ఇరువైపులా భారీ సౌండ్ బాక్సులను అమర్చారు. సభాప్రాంగణంతో పాటు పట్టణంలోని పలు వీధుల్లో కూడా సీఎం ప్రసంగం వినబడేలా మైకులు ఏర్పాటు చేశారు. వేదిక ముందు భాగంలో సుమారు ఐదు వేల కుర్చీలను వేస్తున్నారు. సభాప్రాంగణానికి వందమీటర్ల దూరంలోనే సుమారు నాలుగెకరాల స్థలంలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం రాత్రి 10గంటల వరకు సభాస్థలంలోనే ఉండి ఏర్పాట్లను సమీక్షించారు. సభాప్రాంగణం, హెలీప్యాడ్‌ను పరిశీలించారు. పలు మార్పులు చేయించి ఎవరికీ ఇబ్బంది జరుగకుండా దిశానిర్దేశం చేశారు. 2014 ఎన్నికల ప్రచారాన్ని కూడా హుస్నాబాద్‌లోనే ప్రారంభించి రాష్ట్రంలో గులాబీ జెండాను ఎగురవేశామనీ, ఈసారి కూడా ఇక్కడినుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి గులాబీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు.

1,250మంది పోలీసులతో బందోబస్తు..
సభకు మొత్తం 1,250మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, సిద్దిపేట సీపీ జోయెల్ డెవిస్ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు సభా వేదికను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్‌స్కాడ్, మెటల్ డిటెక్టర్లతో సభాస్థలం మొత్తాన్ని తనిఖీలు చేస్తున్నారు. సభకు వచ్చే వాహనాల కోసం నాలుగు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. సభకు నాలుగు మార్గాల నుంచి వచ్చే వాహనాలకు స్థలాలను ఖరారు చేశారు. సిద్దిపేట వైపు నుంచి వచ్చే వాహనాల కోసం తిరుమల గార్డెన్ వద్ద, హన్మకొండ వైపునుంచి వచ్చే వాటికి మార్కెట్‌యార్డులో, కరీంనగర్ వైపునుంచి వచ్చే వాహనాలకు చిల్లింగ్ సెంటర్ వద్ద, అక్కన్నపేట నుంచి వచ్చే వాటికి స్తూపం వద్ద పార్కింగ్‌కు స్థలం కేటాయించారు. సభాప్రాంగణంలోకి వెళ్లేందుకు మూడు ద్వారాలను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరినీ పోలీసులు మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేసి పంపే ఏర్పాటు చేశారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...