వారసత్వ వైభోగమే!


Tue,January 10, 2017 11:51 PM


(గోదావరిఖని, నమస్తే తెలంగాణ):సింగరేణి కార్మికుల ఇళ్లకు వారసత్వ వైభోగం వచ్చింది. పెళ్లీడు అమ్మాయిలుండి కొలువు ఇస్తామంటే పైసా కట్నం లేకుంటా చేసుకుంటామని అబ్బాయి తరుపువారు, కొలువున్న పెళ్లికొడుకు ఉంటే కట్నం కింద కనీసం రూ. అరకోటైనా చదివించుకుంటామని ఆడపిల్లల తల్లిదండ్రులు ఎగబడుతున్న తీరు, కార్మిక క్షేత్రంలో హాట్ టాపిక్‌లా మారింది.

సింగరేణి సంస్థలో 18ఏళ్ల తర్వాత వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కొలు వులు అమలు కానున్నాయి. సింగరేణిలో 48 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన కార్మికులు వారసత్వ ఉద్యోగాలకు కొడుకు లేదా అల్లుడు లేదా సోదరుడికి ఒక్క దరఖాస్తు చేయడంతో ఉద్యోగం పొందే అవకాశం కలగడంతో సం స్థలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. సింగరేణిలో తాము దిగిపోతే తమ కుటుంబం పరిస్థితి ఏంటని ఇన్నాళ్లు ఆందోళన చెందిన సింగరేణి కార్మికుడు, ఇప్పుడు భరోసాగా ఉంటున్నాడు. తాను దిగిపోతే కూతురు పెండ్లి చేయాలంటేనే తనకు వచ్చే డబ్బులు సరిపోవని బెంగపెట్టుకున్న సదరు కార్మికుడికి, నేడు అనేక ఆఫర్లు వస్తున్నాయి. కుటుంబంలో కొడుకు లేదా అల్లుడికి ఉద్యోగమిచ్చే పరిస్థితితో పెండ్లి కూతుర్లు కావాలంటూ వెతుకుతున్నారు. సింగరేణిలో ఉద్యోగం పొందాలంటే రూ.25లక్షల విలువ ఉంటుందనీ, ఇప్పటికే ఫిక్సయిపోయిన వారు ఇప్పుడు సింగరేణి ఉద్యోగమిచ్చే కార్మికుడి కూతురు కావాలంటూ వెతుకుతున్నారు. ఇంట్లో ఒక కుమారుడు కూ తురు ఉంటే కొడుకు ఏదో మంచి చదువులు అభ్యసించి ఉద్యోగం పొందే అవకాశముంటే, అతనికి దిగిపోయిన తర్వా త వచ్చే డ బ్బులు ఇస్తామని, కూతురుకు మంచి అల్లుడిని చూసి ఉ ద్యోగం ఇస్తామని కార్మికులు పేర్కొంటున్నారు.

ఒక కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే వారిలో ఎవరూ ఎలా బతుకుగలుగుతారో? తెలుసుకొని, ఆ ప్రకారంగా వారసత్వ ఉద్యోగాలిచ్చే పనిలో ఉన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగమంటే భారీగా వేతనాలతో పాటు వైద్య సేవలు, ఇతర వసతులు అన్ని కల్పిస్తుండడం, త్వరలోనే బొగ్గు గని కార్మికులకు 10వ వేతన ఒప్పందం అమలు కానుండడంతో కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి రూ.50వేల దాకా వేతనాలొచ్చే అవకాశముంది. దీంతో సింగరేణి ఉద్యోగమంటే ధీమాతో బతుకవచ్చనే ఆశ ఉంది. వారసత్వ ఉద్యోగాల పుణ్యమా అని కూతుర్లకు ఎక్కడ లేని డిమాండ్ వస్తున్నా మాదిరిగానే, కొడుకుకు సింగరేణి ఉద్యోగమిచ్చే సంబంధం కోసం వెతుకుతున్నారు. తండ్రి దిగిపోయి కొడుకుకు ఉద్యోగం పెట్టిస్తే, పెండ్లి కొడుకుకు కనీసంగా రూ.20లక్షల నుంచి రూ.50లక్షల వరకు కట్నం, లేదా ఆస్తులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. సింగరేణి సంస్థలో ఇటీవల కాలంలో దిగిపోయే కార్మికులకు మంచిగానే పెన్షన్ లభిస్తుండడంతో తమ జీవితాలు వృద్ధాప్యంలో ఎవరిపై ఆధారపడకుండా ఉండవచ్చన్న ధీమాలో కార్మికులు ఉన్నారు.

ఇంతకాలం తాము దిగిపోతే ఆడపిల్లల వివాహాలు ఎలా చేస్తాం? ఎక్కడి నుంచి అప్పులు తేవాలి? వాటిని ఎలా తీర్చాలనే బెంగతో ఉన్న కార్మికులకు వారసత్వ ఉద్యోగాల నిర్ణయం ఎంతో ఊరటనిస్తోంది. సింగరేణిలో తాము దిగిపోయిన తమ స్థానంలో కొడుకు లేదా అల్లుడికి ఉద్యోగం వస్తుందనీ, ఆ తర్వాత తమ జీవితాలు అంతా ఆనందమయంగా ఉంటాయని వారంటున్నారు. సీమాంధ్ర ప్రభుత్వాల హ యాంలో సంస్థను నిర్వీర్యం చేసినా, ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల భద్రతతోపాటు సింగరేణిని విస్తరించే పనిని వేగంగా ముందుకు తీసుకువెళ్తుండడంతో గతంలో కళ కోల్పోయిన కోల్‌బెల్ట్ ప్రాంతాలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. కార్మికుల సంఖ్య తగ్గిపోతూ పట్టణాల రూపురేఖలు మారిపోయిన ఇప్పుడేమో జీవం పోసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో కోల్‌బెల్ట్ ప్రాంతాలు భారీగా విస్తరించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊతమిచ్చేలా కనిపిస్తుంది.

199
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS