స్వశక్తికి ప్రోత్సాహం


Tue,January 10, 2017 11:47 PM


రామగుండం కార్పొరేషన్ : మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అలుగు వర్షిణి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ అధ్యక్షతన మంగళవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ముగ్గులు, పిండి వంటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై, మాట్లాడారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం స్త్రీ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కేవీఐసీ, ఎన్‌ఎస్‌ఐసీ సంస్థలు కూడా మంచి ప్రతిపాదనలతో ముందుకు వస్తే ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారు. మహిళలు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ చేయడానికి దుకాణాలు కూడా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరుగా చేయలేని మహిళలు గ్రూపులుగా ఏర్పడితే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు గ్రూపులుగా ఏర్పడితే వారికి పలు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకునేలా ఆర్థిక సహకారం అందిస్తామన్నారు.

బంజారా ఆర్ట్, ఉడెన్ ఆర్ట్, సానిటరీ నాప్‌కిన్స్‌లాంటి అంశాల్లో శిక్షణ కోసం కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అనంతరం ముగ్గులు, పిండి వంటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి శ్రీ మంజునాథ గ్రూప్, ద్వితీయ బహుమతి సాయి భారత్ గ్రూప్, తృతీయ బహుమతి జగన్మాత స్వశక్తి మహిళా సంఘం సభ్యులు గెలుపొందారు. పిండి వంటల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు జాగృతి సమాఖ్య, జై గణేశ్, గాంధీ సమాఖ్యలు గెలుచుకున్నాయి. విజేతలకు బహుమతులను డీసీపీ విజయేందర్‌రెడ్డి, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, పెద్దపల్లి నగర పంచాయతీ చైర్మన్ రాజయ్య, రామగుండం డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్‌లు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక సంఘం సభ్యురాలు సోమారపు లావణ్య, కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS