విమర్శలకే జాతీయ సంఘాలు


Tue,January 10, 2017 11:45 PM


యైటింక్లయిన్‌కాలనీ : జేబీసీసీఐలో కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన జాతీయ సంఘాలు, కేవలం విమర్శలకే పరిమితమయ్యాయని టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1 సైట్ ఆఫీస్ ఆవరణలో జరిగిన గేట్ మీటింగుకు హాజరై, మాట్లాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి పాపం మూటగట్టుకున్న జాతీయ సంఘాలు, గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌తో ఉద్యోగాల పునరుద్ధరణ సాధ్యం కాదని చెబుతూ కార్మికులను మోసం చేశాయన్నారు. ఇప్పుడు కార్మికులను అయోమయానికి గురి చేస్తూ, లబ్ధిపొందేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. జాతీయ సంఘాల నోరు మూయించేలా అసాధ్యమన్న వారసత్వాన్ని అమలు పరిచి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. దీన్ని జీర్ణించుకోలేని జాతీయ సంఘాలు వారసత్వ అమలుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.

ఎన్ని జిమ్మిక్కులు చేసిన వారసత్వ ఉద్యోగాల అమలు జరుగుతుందన్నారు. 9వ వేతన కాలపరిమితి ముగిసినా పదో వేతన వేజ్‌బోర్డు అమలుపై జాతీయ సంఘాలు ఇప్పటికీ ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు. ఇప్పటికైనా విమర్శలు మాని, కార్మికుల హక్కుల కోసం పోరాడాలని హితవు పలికారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో వారికి కార్మికులు తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో నాయకులు నూనె కొమురయ్య, కొలిపాక మురళి, రఘువీరారెడ్డి, పర్రే రాజనరేందర్, నాగెల్లి సాంబయ్య, బత్తుల రమేశ్, పూర్ణాకర్, రాజిరెడ్డి, తిరుపతి, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్, మహిపాల్, షఫీ, యూసఫ్, రవీందర్ రెడ్డి, సదయ్య, నారాయణ, మల్లయ్య, ఇసంపెల్లి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

271
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS