పండగ పూట.. కల్తీ ఊట!


Tue,January 10, 2017 02:55 AM


(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ):పండగ పూట జిల్లాలో కల్తీ నూనె వ్యాపారం జోరందుకున్నది. వ్యాపారులు ఇతర జిల్లాల నుంచి పెద్దమొత్తంలో నూనె దిగుమతి చేసుకొని, విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా లూజ్ ఆయిల్ విక్రయిస్తూ. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఆహారభద్రత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.

జిల్లాలో కల్తీ నూనెల వ్యాపారం మూడు పూవ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నది. సంక్రాంతి పండగ కావడంతో ఆర్థికంగా ఉన్న లేకున్నా ప్రతి ఇంటిలో పిండి వంటలు (అప్పలు) చేసుకోవడం ఆనవాయితీ. పండగ సీజన్‌కు ముందే పెద్ద ఎత్తున కల్తీ నూనెలు దిగుమతి చేసుకున్న వ్యాపారులు ప్రజలకు కల్తీ నూనెలను మంచి నూనె పేరుతో విక్రయిస్తున్నారు. జిల్లాలో కల్తీ నూనెల విక్రయాలు జోరుగా సాగుతున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. జిల్లా కేంద్రం అయిన పెద్దపల్లితో పాటు రామగుండం, మంథని, ధర్మారం, సుల్తానాబాద్, సెంటనరీ కాలనీ వంటి ప్రాంతాల్లో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి.

జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాతో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో పాటు కరీంనగర్, సుల్తానాబాద్ లాంటి ప్రాంతాల నుంచి జిల్లాలోని నూనె విక్రయ కేంద్రాలకు నూనెలు దిగుమతి అవుతున్నట్లు సమాచారం. నూనెల కల్తీని నివారించడానికి ప్రభుత్వం లూజ్ ఆయిల్ విక్రయాలపై నిషేధం విధించింది. అయినా జిల్లాలో యథేచ్ఛగా లూజ్ ఆయిల్ విక్రయా లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా మార్కెట్‌లో విడి నూనెలు పామాయిల్, పల్లీ నూనె, కాటన్ నూనెలు జోరుగా సాగుతున్నాయి.

పల్లీ నూనె ధర ప్రస్తుతం కిలో రూ.110కి విక్రయిస్తున్నారు. పామాయిల్ కిలో రూ.68, కాటన్ నూనె రూ.70కి విక్రయిస్తున్నారు. పల్లీ నూనె ధర ఎక్కువ కావడంతో పామాయిల్, కాటన్ నూనెను పల్లీ నూనెలో కలిపి ఎక్కువ ధరకు పల్లిగావిక్రయిస్తున్నారు. లూజ్ అయిల్ ము ఖ్యంగా పెద్దపల్లి, గోదావరిఖని, సుల్తానాబాద్, ధర్మారం, మంథనిలాంటి ప్రాంతాల్లో జోరుగా విక్రయిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో లెక్క లేకుండా కల్తీ నూనెల విక్రయాలు జరుగుతున్నాయి. కొందరు వ్యాపారులు పండగ సీజన్ కావడంతో రూ. 10 అదనంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు.

ఆయిల్ మిల్లులో అదే పరిస్థితి


జిల్లాలో కొందరు మినీ ఆయిల్ మిల్లులు నిర్వహిస్తున్నారు. ఆయిల్ మిల్లుల్లో పూర్తి స్వచ్ఛమైన పల్లీ నూనె విక్రయిస్తారని వచ్చిన వారికి ఇక్కడ చేదు అనుభవమే ఎదురవుతున్నది. జిల్లాలోని మెజార్టీ ఆయిల్ మిల్లుల్లో పల్లి నూనెలో పామాయిల్, కాటన్ నూనె, తవుడు నూనె కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.మిల్లులో కొనుగోలు చేసిన నూనెలు సైతం పొంగుతున్నాయని పలువురు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఆయిల్ మిల్లుల విషయంలో అధికారులు చూసి చూడనట్ల వ్యవరించడంతో మిల్లుల సాక్షిగా నూనె వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుందనే ఆరోపణలు గుపుమంటున్నాయి.

ఊరు.. పేరు లేని కంపెనీలు..


ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వంట నూనెలు విడిగా విక్రయించవద్దని, ప్యాకింగ్ చేసి మాత్రమే విక్రయించాలని నిబంధన విధించింది. ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి విడిగా నూనె విక్రయాలు జరుపుతున్న నూనెల వ్యాపారులు ఊరు పేరు లేని వివిధ రకాల ప్యాకింగ్ నూనెలు సైతం విక్రయిస్తున్నారు. ఒక్కో కిరాణం దుకాణంలో ఒక్కో రకం ప్యాకింగ్ నూనెలు విక్రయిస్తున్నారు. జిల్లాలో 50 నుంచి 60రకాల పేర్లతో ఒక లీటర్ ప్యాకెట్ నుంచి మొదలుకొని 15కిలో డబ్బాల వరకు ఊరు పేరు లేని నూనెలు విక్రయిస్తున్నారు. అడ్రస్ లేని కంపెనీల విక్రయాలు జోరుగా సాగినప్పటికీ ఫుడ్ సేప్టీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పండగ సీజన్‌తో పాటు తక్కువ ధర నూనెలు నిత్యం హోటళ్లకు సైతం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాలతో చలగాటం ఆడుతున్నారు. ఇప్పటికైన అధికారులు కల్పించుకొని జిల్లా లూజ్ అయిల్ విక్రయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఊరు పేరు లేని ప్యాకింగ్ నూనెల విక్రయాలను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.

290
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS