వద్దన్నా.. ఆరుబయటే!


Tue,January 10, 2017 02:53 AM


(పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ):కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ప్రతి ఇంటికి మురుగుదొడ్డి నిర్మాణం పేరుతో గతంలో గృహ నిర్మాణ శాఖ ద్వారా మురుగుదొడ్ల నిర్మాణం చేయించారు. గృహ నిర్మాణ శాఖ నుంచి గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్)కు అప్పగించారు. మరుగుదొడ్ల నిర్మాణాలను ఉపాధిహామీ పథకంలో నిర్మించారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు కాకుండా పాత మండలాలు 11 మండలాల్లో 24,588 మరుగుదొడ్ల నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొని, 22,896 పూర్తి చేశారు. మరో 1687 నిర్మించాల్సి ఉంది. మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి ప్రభుత్వం రూ.9,100అందజేసింది. ఇందులో 4,600 ఉపాధిహామీ పథకం నుంచి చెల్లించగా, రూ. 4,500 నిర్మల్ భారత్ అభియాన్ ద్వారా చెల్లించారు.

జిల్లాలో 82. 30శాతం పూర్తి..


జిల్లాలోని 11 మండలాల్లో 1,34,159 ఇళ్లుండగా, ఇందులో ఇప్పటి వరకు రూ. 1,10,434 మరుగుదొడ్లు నిర్మించారు. మిగిలిన 23,725 ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 5,164 మరుగుదొడ్లు పూర్తి కాగా, 18,558 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 8,843 మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతి రావాల్సి ఉంది. జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి నగర పంచాయతీ మినహా జిల్లాలో 82.30శాతం మరుగుదొడ్లు పూర్తయ్యాయి. ఆర్‌డబ్ల్యూఎస్ ప్రస్తుతం అనుమతిచ్చిన వాటికి ప్రభుత్వం రూ.12వేలు చెల్లిస్తుంది. పెద్దపల్లి నగర పంచాయతీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10,463 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకొని మరుగుదొడ్ల నిర్మించుకునేందుకు 1900మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని తిరస్కరించగా, 1400కు అనుమతిచ్చారు. ఇందులో మరో 240 మరుగుదొడ్లు పూర్తి కావాల్సి ఉంది.

నిర్మాణాలు చేసినా నెరవేరని లక్ష్యం


ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసిన మురుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసిన ఆరుబయట మలవిసర్జన యథావిధిగా కొనసాగుతున్నది. మెజార్టీ గ్రామాల్లో ప్రజలు నేటికి బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం పూట ఏ గ్రామానికి వెళ్లిన రోడ్ల వెంట చెంబుముంతలు దర్శనం ఇ స్తున్నాయి. జిల్లాలోని చాలా గ్రామాల్లో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయినా, గ్రామాల్లో ప్రజలు వా టిని మాత్రం ఉపయోగించడం లేదు. నిర్మాణం పూర్తి చేసుకున్న వారు మరుగుదొడ్డిని ఉపయోగించేలా అవగాహన క ల్పించాల్సిన గ్రామస్థాయిలో ప్రజాప్రతిని ధులు(సర్పంచ్, ఎంపీటీసీలు)లతో పాటు గ్రామస్థాయిలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ అధికారి, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు మరుగుదొడ్ల వాడకంపై అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు.

దీంతో జిల్లాలోని మెజార్టీ గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన చేస్తున్నారు. ఆరుబయట మలవిసర్జనతో రోగాలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలు వెచ్చించి, నిర్మించిన మరుగుదొడ్లను వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS