సమస్యలు ఎరిగి.. కాలినడకన తిరిగి..


Wed,November 13, 2019 02:12 AM

భీమ్‌గల్‌ : మున్సిపాలిటీగా మారిన భీమ్‌గల్‌ పట్టణాన్ని అన్నిరంగాల్లో ముందు నిలిపేందుకు తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భీమ్‌గల్‌ పట్టణంలోని బాపూజీనగర్‌, అయ్యప్పనగర్‌, శ్రీరాంనగర్‌, ఆదర్శనగర్‌, విద్యానగర్‌, ఎస్సీవాడ, నందిగల్లీ తదితర కాలనీల్లో రూ.25 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయా కాలనీల్లో తిరుగుతూ అభివృద్ధి పనుల గురించి కాలనీ వాసుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చిన తర్వాత అప్పటి గౌరవ ఎంపీ కవిత ప్రత్యేక కృషితో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ని ఒప్పించి రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయించారన్నారు. ఈ నిధులను మంజూరు చేసిన మాజీ ఎంపీ కవితతో పాటు మంత్రి కేటీఆర్‌కు పట్టణ ప్రజల తరపున ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంజూరైన నిధులతో రూ.15 కోట్లతో పట్టణంలో సీసీ, బీటీ రోడ్లతో పాటు సీసీ డ్రైనేజీల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటికే అన్ని పనులకు టెండర్లు పూర్తి చేయించడంతో పాటు పనులను ప్రారంభించామన్నారు. పట్టణంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఆయా కాలనీల్లో పనులను గుర్తించి నిర్మాణాలు చేయిస్తామని చెప్పారు. కోటి రూపాయలతో వెజిటేబుల్‌ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

అందుకోసం స్థలాన్ని గుర్తించామన్నారు. మార్కెట్‌ ఏర్పాటుకు కావాల్సిన ప్రక్రియను వేగవంతం చేసినట్లు మంత్రి తెలిపారు. మరో రూ.6 కోట్లతో పట్టణంలో ఉన్న అన్ని శ్మశాన వాటికలను నిర్మించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అసంపూర్తి రోడ్లు, మురికి కాలువలు పూర్తికి రూ.4 కోట్లతో చేపడతామని తెలిపారు. కోటి రూపాయలతో పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా కల్యాణమండపం నిర్మిస్తామన్నారు. భీమ్‌గల్‌ పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ పనులన్నీ నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తిచేయడానికి పట్టణ ప్రజలు, నాయకులు సహాయ సహకారాలు అందించాలని మంత్రి కోరారు. మంత్రి వెంట ఎంపీపీ ఆర్మూర్‌ మహేశ్‌, జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కొండ ప్రకాశ్‌గౌడ్‌, గుణ్‌వీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్‌, శర్మానాయక్‌, తుక్కాజీ నాయక్‌, మల్లెల లక్ష్మణ్‌, శెవ్వ అశోక్‌, బొదిరే నర్సయ్య, బొదిరే గంగారాం, పశుల ముత్తన్న, చెప్పాల గణేశ్‌, పర్శ నవీన్‌, సతీశ్‌గౌడ్‌, బుర్ర దేవేందర్‌గౌడ్‌, అబ్దుల్‌ రజాక్‌, సర్వర్‌ హుస్సేన్‌, మజ్జుబాయ్‌, శివసారి నర్సయ్య, భగత్‌గౌడ్‌, పతాని లింబాద్రి, బొదిరే తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...