నాలుగు గంటలు.. కాలినడకన


Wed,November 13, 2019 02:11 AM

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: భీమ్‌గల్‌ పట్టణ రూపురేఖలు మార్చడంపై, పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు తదితర ప్రధాన అభివృద్ధిపై రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా భీమ్‌గల్‌ పట్టణంలో రూ. 25 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. వివిధ కాలనీల్లో కాలినడకన తిరుగుతూ నాలుగు గంటల పాటు పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానికులతో మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పట్టణాభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఈ సందర్భంగా పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

భీమ్‌గల్‌కు మహర్దశ...
భీమ్‌గల్‌ దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక, సరైన రోడ్లు లేక, సరిపడ మురికి కాలువలు లేక అధ్వాన స్థితిలో కొనసాగుతూ వచ్చింది. ఇలాంటి దుస్థితితో ఉన్న భీమ్‌గల్‌ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ వ్యాప్తి కార్యక్రమంలో భాగంగా భీమ్‌గల్‌లో వీధివీధినా తిరిగిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. భీమ్‌గల్‌ వెనుకబాటును, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను గమనించారు. 2014లో ప్రశాంత్‌రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలువగానే భీమ్‌గల్‌ అభివృద్ధిపై దృష్టిసారించారు. పట్టణాభివృద్ధికి భారీగా నిధుల అవసరం ఉన్నప్పటికీ, అప్పటికప్పుడు అవసరమైన పనులకు నిధులు మంజూరు చేయించి కొన్ని పనులు చేయించారు. ఈ పనులతో భీమ్‌గల్‌ వెనుకబాటుతనం దూరం కాదని గుర్తించిన ఆయన, అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి భీమ్‌గల్‌ పట్టణ అభివృద్ధికి గాను నిధుల కోసం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు. పట్టణాభివృద్ధికి భారీగా నిధుల ఆవశ్యకతను వివరించి, అప్పటి ఎంపీ కవిత సహకారంతో మంత్రి కేటీఆర్‌ ద్వారా రూ.25 కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేయించారు. భీమ్‌గల్‌ పట్టణాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో మున్సిపాలిటీగా చేయించారు.

అనంతరం పట్టణంలో అధికారులతో, టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి గల్లీ గల్లీలో కలియతిరిగి సమస్యలను గుర్తించారు. దుమ్ము రేగుతున్న రోడ్లను, రోడ్లపై పారుతున్న మురికినీటిని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా గుర్తించారు. పట్టణంలో శ్మశాన వాటికల్లో సదుపాయాలు లేని ధైన్యాన్ని, పట్టణంలో సరైన మార్కెల్‌ లేవి విషయాన్ని గమనించారు. ప్రత్యేకంగా మంజూరు చేయించిన రూ.25 కోట్లతో ఈ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు వేయించారు. రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ. 6 కోట్లతో శ్మశాన వాటికల్లో సౌకర్యాల కల్పనకు, పట్టణంలో వెజిటేబుల్‌, నాన్‌ వెజిటేబుల్‌ మార్కెట్‌ కోసం ప్రణాళికలు రూపొందించారు. ఈ నిధులతో పనులను ప్రారంభించారు. పట్టణంలోని బాపూజీనగర్‌, అయ్యప్పనగర్‌, శ్రీరాంనగర్‌, ఆర్యనగర్‌, విద్యానగర్‌, ఎస్సీవాడ, నందిగల్లీ తదితర కాలనీల్లో ఈ పనులను చేపట్టారు. కొనసాగుతున్న ఈ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నారు. మంగళవారం స్వయంగా ఆయనే వచ్చి పనులను పరిశీలించారు. ఉదయం 10 గంటలకు పట్టణ శివారుకు చేరుకున్న మంత్రి.. అక్కడి నుంచి పనులు జరుగుతున్న ప్రతీ కాలనీలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. నాలుగు గంటల పాటు ఈ కాలనీలన్నింటిలో కలియ తిరుగుతూ క్షుణ్ణంగా పనులను పరిశీలించారు. తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో మార్కెట్‌ ఏర్పాటు కోసం గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు.పట్టణాభివృద్ధికి మంత్రి పడుతున్న తపనను చూసి ఆయా కాలనీల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇండ్లల్లోంచి బయటకు వచ్చి పలువురు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వీటితో పాటు పట్టణంలో రూ. కోటితో కల్యాణ మండపం నిర్మిస్తున్నట్లు మంత్రి మరోసారి తెలిపారు. పట్టణాభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌కు, సహకరించిన అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...