కల్యాణం.. కమనీయం


Thu,November 7, 2019 01:17 AM

-కన్నుల పండువగా భీమ్‌గల్ లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీనారసింహుని కల్యాణం
-భక్తజన సంద్రమైన నింబాచల క్షేత్రం

భీమ్‌గల్ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమన్నింబాచలంపై బుధవారం శ్రీలక్ష్మీనారసింహుని కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవాన్ని ఆలయర అర్చకులు బుధవారం కన్నుల పండువగా జరిపించారు. దేవీ, దేవరుల కల్యాణం ఆద్యాంతం కన్నుల పండువగా సాగింది. ఈ కమనీయ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు శ్రీమన్నింబాచల కొండకు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. ఉదయం గర్భాలయంలోని స్వామివారి మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణాలంకార భూషితులైన శ్రీలక్ష్మీనారసింహుల ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలతో గర్భాలయం నుంచి కల్యాణ మండపానికి పుష్పమాలికలతో అలంకరించిన పల్లకీలో తీసుకువచ్చారు. కల్యాణ వీధుల్లో కలశపూజ, విశ్వక్ష్సేన పూజ నిర్వహించి స్వామివారికి రక్షాబంధనం గావించారు.

శఠగోపానికి పాదప్రక్షాళన చేపట్టారు. కన్యం, కనక సంపన్నమంటూ మంత్రాలు పఠించి స్వామివారికి కన్యాదానం చేశారు. శ్రీనృసింహుడు, శ్రీలక్ష్మీదేవిని ఎదరెదురుగా కల్యాణపీఠంపై కూర్చోబెట్టి మంగళవాయిద్యాలు, మేళతాళాలు మోగుతుండగా.. మాంగళ్య పూజ నిర్వహించి కల్యా ణం జరిపించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు నంబి లింబాద్రి కుటుంబీకులు స్వామివారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు పుణ్యలోకములను చేరుకుందురని ఈ సందర్భంగా అర్చకులు పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సతీమణి వేముల నీరజారెడ్డి, సోదరుడు అజయ్‌రెడ్డి దంపతులు, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, గుణ్‌వీర్‌రెడ్డి, తుక్కాజీ నాయక్, శర్మనాయక్, మూత లింబాద్రి, అరిగెల జనార్దన్, రంగుల గంగాధర్, పతాని లింబాద్రి తదితరులు కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. కల్యాణం అనంతరం రాత్రి స్థాలిపాక హోమాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. గురువారం దశమి, ఏకాక్షరి హవనం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...