రుద్రూర్ : మానవ జన్మలో సేవ, భగవాన్ నామస్మరణతో ప్రతి ఒక్కరి జీవితం పావనం, సుఖమయం అవుతుందని శ్రీశ్రీశ్రీమాదవానంద సరస్వతి స్వామి అన్నారు. బుధవారం రుద్రూర్లో ఉన్న విఠలేశ్వరాలయంలో కార్తీకమాస కాగడ హారతి సందర్భంగా ప్రవచనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఒకరికొకరు మర్యాదగా పలకరించే సంస్కృతికి దూరమవుతున్నారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా, అర్థం పర్థంలేని వీడియోలు చూడడం, మొబైల్ ఫోన్‌ను ఎల్లవేళలా పట్టుకొని ఉండడం, టీవీ సీరియళ్లతో కుటుంబ కలహాలు చెలరేగుతున్నాయన్నారు. పలు విధాలుగా సమాజంలో మానవ సంబంధాలు దెబ్బ తింటున్నాయన్నారు. పెద్దలతో మర్యాదగా ప్రవర్తించడం, తల్లిదండ్రులను దైవంతో సమానంగా చూడడంతో రానున్న తరాల్లో పెద్దలపై గౌరవ మర్యాదలు, తల్లిదండ్రులపై ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో రాముపంతులు, శ్రీనివాస్‌చారి, గ్రామస్తులు పాల్గొన్నారు.