బల్దియా పోరుకు లైన్‌ క్లియర్‌!


Wed,October 23, 2019 02:30 AM

నిజామాబాద్‌ సిటీ : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధ్దంగా జరగడం లేదని దాఖలైన అన్ని వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆయా పరిధిలో కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని, తీర్పు వెలువరిన వెంటనే ఎన్నికలు నిర్వహించేలా అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మరోవైపు కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎదురుచూస్తున్న ఆశావహులకు, తాజా హైకోర్టు తీర్పుతో ఉపశమనం పొందారు. త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ రానుంది.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సిద్ధం..
నిజామాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధంగా ఉన్నారు. గతంలోనే ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 60 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండేవి. ప్రభుత్వం నిజామాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ (నుడా)ను ఏర్పాటు చేసింది. దీంతో నిజామాబాద్‌ నగర చుట్టూ ఉన్న పది గ్రామాలను మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చేసింది. దీంతో 60 డివిజన్లలో అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఆశావహుల్లో చిగురించిన ఆశలు...
నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నారు. టిక్కెట్టు కోసం పార్టీ నాయకుల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని కొందరు ఇప్పటికే తమ కాలనీల్లో ప్రచారం మొదలు పెట్టారు. కొన్ని నెలలుగా మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడంతో కొద్ది రోజులుగా ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మంగళవారం తాజాగా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించుకోవాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పోటీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి ప్రకటన చేసిన వెంటనే అభ్యర్ధులు టిక్కెట్ల కోసం పోటీపడనున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ సర్వం సిద్ధం..
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇన్‌చార్జ్జిలను నియమించి, ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని ఇది వరకే పిలుపు నిచ్చారు. కోర్టు పరిధిలో ఎన్నికల వ్యవహారం ఉండడంతో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ని సంసిద్ధం చేసి, ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా ఎన్నికల ఆటంకాలను తొలగిస్తూ మార్గం సుగమం చేయడంతో పార్టీ క్యాడర్‌లో నయాజోష్‌ వచ్చింది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా తుల ఉమను నియమించిన విషయం తెలిసిందే. బోధన్‌ మున్సిపాలిటీ, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఫరూఖ్‌ హుస్సేన్‌, భీమ్‌గల్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీలకు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డిని నియమించారు. ఇప్పటికే పలు దఫాలుగా కేటీఆర్‌ రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో పాటు మున్సిపల్‌ ఇన్‌చార్జులు, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జులతో సమావేశమై బల్దియాలపై గులాబీ జెండా ఎగురవేసే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్‌ ఎన్నికల ఉత్కంఠకు తెరపడడంతో, ఇక ఎన్నికల రంగంలోకి దూకెందుకు గులాబీ సైన్యం సిద్ధమైంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల కోసం పార్టీ క్యాడర్‌ను సంసిద్ధం చేశారు. టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల జాబితాను సేకరిస్తున్నట్లు సమాచారం.

అయితే వార్డులు, డివిజన్ల విభజన పూర్తయినప్పటికీ, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తయితే టికెట్లు ఆశించే ఆశావహులు తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసుకోనున్నారు. కాగా, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడూ జరుగుతాయని ఎదురుచూస్తుండగా.. ప్రతిపక్షాల్లో మాత్రం నిస్తేజం అలుముకున్నది. కాంగ్రెస్‌, బీజేపీ ఈ ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం తీసుకున్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న ప్రతిపక్షాలు.. బల్దియా ఎన్నికలకు రూట్‌ క్లియర్‌ కావడంతో ఓ రకమైన కలవరపాటుకు గురవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఈ పరిణామాలు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. ఇందూరు నగర పాలక సంస్థ పీఠంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల పీఠాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కథనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...