హైఅలర్ట్..


Sat,October 19, 2019 02:18 AM

-ఆర్టీసీ కార్మికుల బంద్ పిలుపు నేపథ్యంలో అడుగడుగునా అప్రమత్తం
-జిల్లావ్యాప్తంగా భారీ బందోబస్తు
-వేయి మంది బలగాలతో పటిష్టమైన భద్రత చర్యలు
-10 ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు
-ప్రధాన కూడళ్ల వద్ద నిఘా

నిజామాబాద్ క్రైం/ నిజామాబాద్ సిటీ: నేటి రాష్ట్ర బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ భద్రత చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి వేయి మంది పోలీస్ బలగాలను రంగంలోకి దింపారు. జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో భద్రత చర్యలు నిర్వహిస్తున్నారు. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలు, స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.

బస్టాండ్లు కిటకిట
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రీజియన్‌లో అధికారులు పెద్దసంఖ్యలో బస్సులను నడిపిస్తున్నారు. పల్లెవెలుగు నుంచి సూపర్ లగ్జరీ వరకు బస్సులను ప్రయాణికులను అందుబాటులో ఉంచారు. ప్రతిరోజూ రెండు జిల్లాల్లో 400కుపైగా బస్సులను ప్రభుత్వం నడిపిస్తున్నది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో పూర్తిస్థాయిలో బస్సులు నడిపించేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. డిపో, బస్టాండ్‌లో పోలీసు బందోబస్తు మధ్య బస్సులను నడిపిస్తున్నారు. ఆర్టీఏ అధికారులు బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు రాజకీయ, వామపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. 14వ రోజు ఉమ్మడి జిల్లాలో బస్సులు విజయవంతంగా నడిచాయి. ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసు అధికారులు బ్రీత్ అనలెజర్‌తో టెస్టు నిర్వహించిన తర్వాతే బస్సులను అప్పగించారు.

బస్సులతో నిండుగా ప్లాట్‌ఫాంలు
నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఉన్న బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాంలు బస్సులతో నిండిపోతున్నాయి. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. బస్టాండ్‌లో బస్సులు ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు గరుడ ప్లస్, రాజాధాని బస్సులు వచ్చాయి. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి నుంచి నాన్‌స్టాప్ బస్సులను అధికారులు మొదలు పెట్టారు. తాజాగా హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు రావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నిజామాబాద్ నుంచి ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఆర్టీసీ కార్మికులకు పలువురు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట బతుకమ్మ ఆడారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ధర్నాచౌక్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మోకళ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

14వ రోజు 456 బస్సులు..
నిజామాబాద్ రీజియన్ పరిధిలో 14వ రోజు 456 బస్సులు నడిచాయి. నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఆర్మూర్ (62), బోధన్ (65), నిజామాబాద్-1 (69), నిజామాబాద్-2 (68) కలిపి మొత్తం 264 బస్సులు నడిచాయి. కామారెడ్డి డివిజన్ పరిధిలో బాన్సువాడ (86), కామారెడ్డి (106) బస్సులను అధికారులు నడిపించారు. మొత్తం 192 బస్సులు నడిచాయి. 85 శాతం మేర శుక్రవారం బస్సులను అధికారులు నడిపించారు.

బోధన్‌లో భారీ బందోబస్తు
బోధన్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ శనివారం రాష్ట్ర బంద్ జరపాలని పిలుపుఇవ్వడం, ఇందుకు కొన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలకడం తో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బంద్‌ను అన్ని రకాలుగా ఎదుర్కొనే దిశగా ఆర్టీసీ, పోలీసు అధికారులు చ ర్యలు చేపట్టారు. మరోపక్క బంద్ ముసుగులో దుండగులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఇంటలీజెన్స్ వర్గా లు నిఘా వేశాయి. బోధన్ పట్టణంలో ఆర్టీసీ కార్మిక సంఘా ల నాయకులు దుకాణాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలకు వెళ్లి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ క్రమంలో ప్రభుత్వ సూచనల మేరకు బంద్ ప్రభావం సాధారణ జన జీవనంపైనా, ముఖ్యంగా ప్రయాణికులపై లేకుండా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. బోధన్ బస్‌డిపో ఉన్న పట్టణంలోనూ, బోధన్ డివిజన్‌లోని వివిధ గ్రామాల్లోనూ బస్‌ల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు రక్షణ కల్పించనున్నారు. పట్టణ శివార్లలో పోలీస్ నిఘాను పెంచారు. బోధన్‌లో శాంతి భద్రతల పరిస్థితిని బోధన్ ఏసీపీ రఘు, జాన్కంపేట్‌లోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం ఏసీపీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

బోధన్ నుంచి కొనసాగిన ఆర్టీసీ బస్సులు
శక్కర్‌నగర్: ఆర్టీసి సమ్మె కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బోధన్ ఆర్టీసీ డిపో నుంచి బస్సులను శుక్రవారం కొనసాగించారు. ఆర్టీసీ డిపోలోని 36 అద్దె బస్సుతో పాటు 29 ఆర్టీసీకి చెందిన బస్సులను నడిపారు. బోధన్ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్‌తో పాటు గ్రామీణ ప్రాంతాలకు సైతం బస్సు సర్వీసులను కొనసాగించారు. బస్టాండ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...