మరింత అగ్గువ..


Sat,October 19, 2019 02:15 AM

బోధన్, నమస్తే తెలంగాణ : మూడు నెలల వ్యవధిలో వరుసగా మూడోసారి ఎరువుల ధరలు తగ్గడం రైతులకు ఎంతో ఊరటనిచ్చింది. జిల్లాలో కాంప్లెక్స్ ఎరువుల విక్రయాల్లో అగ్రగామిగా ఉన్న ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను భారీగా తగ్గిస్తూ వారం రోజుల కిందట నిర్ణయించి రైతులకు తీపి కబురు అందించింది. నాలుగైదు రోజులుగా తగ్గించిన ధరలకు ఇఫ్కో డీలర్లు ఎరువుల విక్రయాలు చేస్తున్నారు. ఈ నెల 11న ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సహకార వాణిజ్య ప్రదర్శనలో పాల్గొన్న ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ రైతుల పెట్టుబడులను తగ్గించేందుకు తమ సంస్థ ఎరువుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఈ తగ్గింపు ధరలు అమల్లోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం డీఏపీ

50 కిలోల బస్తాపై రూ.50, వివిధ కాంప్లెక్స్ ఎరువులపై గరిష్టంగా రూ.25 వరకు ఇఫ్కో తగ్గించింది. కాంప్లెక్స్ ఎరువుల తయారీలో ప్రధాన ముడి సరుకుగా ఉన్న పాస్ఫారిక్ యాసిడ్ ధర విదేశీ విపణిలో తగ్గడం.. ఇఫ్కో కంపెనీ ఎరువుల ధరలు తగ్గించడానికి ప్రధాన కారణం. జిల్లాలో ఈసారి వర్షాలు సమృద్ధిగా పడడం, 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాతో ధాన్యంతో పాటు ఇతర పంటల దిగుబడులు పెరిగాయి. మరోపక్క మద్దతు ధరలకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు జరుపుతుండడంతో రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో రానున్న యాసంగి సీజన్‌లో కూడా పంటల సాగు చేపట్టేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇఫ్కో కంపెనీ ఎరువుల ధరలు తగ్గించడం రబీ సీజన్‌లో సాగుకు ఊతమివ్వనుంది.

దశాబ్ద కాలంగా ఎరువుల ధరలు రెట్టింపు కావడంతో వాటిని కొనుగోలు చేయాలంటేనే రైతులు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. ఈ దశలో ఇఫ్కో కంపెనీ తమ ఉత్పత్తులైన డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను మూడు నెలలుగా తగ్గించడం పంటల సాగుకు మేలు చేసింది. వాస్తవానికి తెలంగాణలో పంటలకు రసాయనిక ఎరువులు ఎక్కువగా వినియోగించే జిల్లాలో నిజామాబాద్ ఒకటి. దీంతో వర్షాలు పడగానే.. ఒక్కసారిగా జిల్లాలో ఎరువులకు డిమాండ్ ఏర్పడుతుంది. దీన్ని ఆసరాగా తీసుకొని గతంలో వివిధ కంపెనీలు ఎరువుల ధరలను ఇష్టమొచ్చినట్లుగా పెంచిన దాఖలాలు ఉన్నాయి. అటువంటిది ఇఫ్కో కంపెనీ డీఏపీ, కాంప్లెక్స్ ధరలను తగ్గించడంతో రైతులకు ఎకరానికి వేసే ఎరువుల్లో ఐదు వందల నుంచి ఏడెమినిది వందల వరకు లాభం చేకూరుతుంది. వరి పంటకు కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్న, పసుపు, సోయాబీన్, పత్తి తదితర పంటలకు కాంప్లెక్స్ ఎరువులను వాడుతుంటారు.

డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల తగ్గింపు ఇలా..
ఇఫ్కో కంపెనీ డీఏపీ 50 కిలోల బస్తా ధర మూడు నెలల కిందట రూ.1400 కాగా, దానిపై మూడు విడతలుగా ధరలు తగ్గించడంతో ఇప్పుడు ఆ ఎరువు ధర రూ.1200లుగా స్థిరపడింది. 10:26:26 ఎరువు ఎంఆర్‌పీని రూ.1175కు తగ్గించారు. ఈ ఎరువుపై కూడా మూడు విడతలుగా రూ.190 తగ్గినట్టయ్యింది. తగ్గిన ధరల ప్రకారం ఇకపై కాంప్లెక్స్ ఎరువు 20:20:13 ధరను ప్రస్తుతం రూ.975కు తగ్గించారు. మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా తగ్గాయి. కాంప్లెక్స్ ఎరువులకు అవసరమైన ముడి పదార్థం ఫాస్పారిక్ యాసిడ్ ధర విదేశీ విపణిలో తగ్గడంతో రైతుల మేలు కోసమే తమ కంపెని డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించిందని ఇఫ్కో నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఫీల్డ్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్ అంటున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...