లక్కీడ్రాప్ ఎవరికో..!


Fri,October 18, 2019 04:02 AM

-నేడే మద్యం దుకాణాల డ్రా
- తొలిసారిగా జిల్లా మద్యం టెండర్లకు 87 మంది మహిళల దరఖాస్తు
నమస్తే తెలంగాణ / నిజామాబాద్ ప్రతినిధి: మద్యం దుకాణాల కేటాయింపు కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో డ్రా పద్ధ్దతిలో వైన్ షాప్‌లను కేటాయించనున్నారు. కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనున్నది. తొలుత కలెక్టర్ ఓ దుకాణానికి డ్రా పద్ధ్దతిలో కూపన్ తీసి, డ్రాలో పేరు వచ్చిన వారికి వైన్‌షాప్‌ను కేటాయిస్తారు. అనంతరం క్రమ పద్ధ్దతిలో షాపుల వారీగా డ్రా విధానంలో మద్యం షాపుల కేటాయిస్తారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 91 దుకాణాలకు మద్యం టెండర్లు నిర్వహించారు. వీటిని దక్కించుకునేందుకు 1,072 మంది పోటీ పడుతున్నారు. షాపులను దక్కించుకునేందుకు వచ్చిన దరఖాస్తుల ద్వారా జిల్లాలో ప్రభుత్వానికి రూ. 21.44 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి అత్యధికంగా మహిళలు కూడా టెండర్లలో పాల్గొన్నారు. మొత్తాం 87 మంది మహిళలు దరఖాస్తులు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రా పద్ధతిన షాపుల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమ సరళిని మొత్తం వీడియో రికార్డింగ్ ద్వారా నిక్షిప్తం చేయనున్నారు. ఈసారి సిండికేట్‌కు అవకాశం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. కొన్ని దుకాణాలకు మాత్రం అమ్మకాలు తక్కువగా ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో మడిగెలు దొరకడం కష్టంగా ఉండడం, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్నవాటికి మాత్రం కొంతమేర దరఖాస్తులు తక్కువగా వచ్చాయి.

కొన్ని మండలాలు పెద్దగా ఉండడం, గ్రామాలు అధికంగా ఉన్న చోట దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. అత్యధికంగా ఏర్గట్ల వైన్ షాప్‌నకు 44 దరఖాస్తులు రాగా.. షాటాపూర్, నందిపేట్, నవీపేట్, ఖానాపూర్, మోపాల్ తదితర వైన్‌షాపులకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ సిటీలో మొత్తం 19 దుకాణాలు ఉండగా.. అత్యధికంగా 18 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇంతకు ముందు గుడ్‌విల్ వ్యవస్థ కొనసాగేది. లక్కీడ్రాలో షాపును దక్కించుకొని వేరొకరికి గుడ్‌విల్‌కు అమ్ముకునేవారు. ఇప్పుడా వ్యవస్థ లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. దీంతో ఆసక్తి ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారు. వైన్ షాపు కేటాయించిన తర్వాత బినామీలు నడిపిస్తే చర్యలు తీసుకోనున్నారు. ఒక్కొక్కరికి ఒకే వైన్ షాపుకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉండడంతో, చాలా మంది తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపారు. ఆసక్తి ఉన్న ఇతర వైన్‌షాపులకు కూడా డీడీలు చెల్లించి దరఖాస్తులు సమర్పించారు.

దాదాపు మహిళలు సమర్పించిన దరఖాస్తులన్నీ, ఒకే ఇంట్లో రెండు, మూడు చొప్పున మద్యం షాపులను దక్కించుకునేందుకు, అదృష్టాన్ని పరీక్షించుకునేందుకేనని తెలుస్తోంది. నాన్ రిఫండబుల్ మొత్తం రూ. 2 లక్షలు పెట్టినా .. ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. 1,072 దరఖాస్తులు రావడంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎవరికి అదృష్టం వరించేనో అనేది ఉత్కంఠగా మారింది. వీరంతా నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియానికి తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం కిక్కిరిసిపోనుంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సారి మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం వ్యాపారులు వచ్చారు. ఈ వ్యాపారంలో అనుభవం లేనివారు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ముందుకు వచ్చారు. పాత మద్యం వ్యాపారులు ఇంతకు ముందు ఒకటికి మించి పదుల సంఖ్యలో దరఖాస్తులు వేసినవారు.. ఇప్పుడు కొన్నింటికే పరిమితమయ్యారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...