వీసీ పీఠం ఎవరికో!


Thu,October 17, 2019 12:50 AM

-టీయూ వీసీ పోస్టుకు భారీగా దరఖాస్తులు
-124 దరఖాస్తులు రాగ.. జల్ల్లెడ పడుతున్న సెర్చ్ కమిటీ
-ఓయూ, కేయూ ప్రొఫెసర్లకే చాన్స్!
-ఎవరి ప్రయత్నాల్లో వారు..

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ (వీసీ) పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. అందుకు తగ్గట్టే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గతంలో టీయూ వీసీ పోస్టు కోసం 60 నుంచి 70 వరకు దరఖాస్తులు చేసుకోగా.. ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 124 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీసీ పోస్టు కోసం ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తులను సభ్యులు జల్లెడ పడుతున్నారు. సెర్చ్ కమిటీ సభ్యులు కూలంకషంగా దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గతంలో మాదిరి కాకుండా అన్ని అర్హతలు, సామర్థ్యం ఉన్న ప్రొఫెసర్లనే వీసీలుగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు కమిటీ సభ్యులు అర్హతలున్న వారినే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇన్‌చార్జి పాలనలో మరికొద్ది రోజులు...
జూలై నెల 24న రెగ్యులర్ వీసీ సాంబయ్య పదవీ బాధ్యతలు ముగిశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు పలు వర్సిటీలకు సీనియర్ ఐఏఎస్‌లను ఇన్‌చార్జి వీసీలుగా నియమించింది. ఈ క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇన్‌చార్జి వీసీగా ప్రభుత్వం నియమించింది. ఆయన జూలై 25న టీయూ ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వీలు దొరికినప్పుడల్లా ఆయన తెలంగాణ విశ్వవిద్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. ఇప్పటికే రెండు నెలలు గడిచిన నేపథ్యంలో, ఈనెల 3న యూనివర్సిటీల చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్ని వర్సిటీల సెర్చ్ కమిటీల సభ్యులతో సమావేశమైనట్లు తెలిసింది. ఆయా వర్సిటీలకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమర్థులనే వీసీలుగా పంపాలన్న గవర్నర్, ప్రభుత్వ నిర్ణయాల మేరకు మరికొద్ది రోజులే ఇన్‌చార్జి వీసీల పాలన సాగనుంది. ఈ క్రమంలో అప్పటి వరకు సెర్చ్ కమిటీల సభ్యులు దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పదేండ్ల నిబంధనలతో...
రాష్ట్ర ప్రభుత్వ అన్ని యూనివర్సిటీలకు వీసీలుగా వెళ్లేవారు కనీసం బోధనారంగంలో ప్రొఫెసర్‌గా పదేండ్ల అనుభవం ఉండాలని నిర్ణయించింది. దీంతో పదేండ్లు పూర్తి చేసుకున్న ప్రొఫెసర్లకే వీసీ పోస్టు దక్కే అవకాశం ఉంది. తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో, చాలా మంది పదేండ్ల బోధనానుభవం లేదు. దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 50 మంది ప్రొఫెసర్లు ఐదు, ఆరేండ్ల అనుభవమే ఉంది. మరో నిబంధన ఏమంటే ఏ యూనివర్సిటీలో అయితే ప్రొఫెసర్‌గా ఉన్నారో, వారికి అదే యూనివర్సిటీకి వీసీగా ఇచ్చే అవకాశం లేదు. తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి దరఖాస్తు చేసుకున్న ప్రొఫెసర్లు శివశంకర్, యాదగిరి, నసీం, ప్రస్తుత రిజిస్ట్రార్ బలరాములు ఉన్నారు. వీరిలో బలరాములుకు ఐదేండ్ల అనుభవమే ఉంది. ఈ లెక్కన ఆయనకు అవకాశం లేనట్టే. ఇక మాస్ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ శివశంకర్, కామర్స్ విభాగం ప్రొఫెసర్ యాదగిరి, కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ నసీంలకు వీసీగా ఎంపికయ్యే అవకాశం ఉంది. వారికి కూడా తెలంగాణ విశ్వవిద్యాలయానికి వీసీగా వచ్చే అవకాశం లేదు. వారు మరో యూనివర్సిటీకి వెళ్లవచ్చు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...