రయ్..రయ్!


Wed,October 16, 2019 01:16 AM

నిజామాబాద్ సిటీ: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అన్ని ప్రాంతాలకు బస్సులను అందుబాటులో ఉంచడంతో ప్రయాణికులు సేవలు వినియోగించుకుంటున్నారు. బస్సు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటున్నది. తాత్కాలిక డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయకుండా రవాణా శాఖ అధికారులు బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 11వ రోజు నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగగా.. ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో అన్ని ప్రాంతాలకు విజయవంతంగా బస్సులు నడిపారు.

పెరిగిన బస్సులు
వందశాతం బస్సులు నడపాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాలతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఆర్టీసీ సమ్మె 11వ రోజు మంగళవారం నిజామాబాద్ ఆర్టీసీ రీజీయన్ పరిధిలో 445 బస్సులను నడిపించారు.

నిజామాబాద్ జిల్లాలో...
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డిపో పరిధిలో 72 బస్సులు, బోధన్ డిపో పరిధిలో 73, నిజామాబాద్-1 డిపో పరిధిలో 67, నిజామాబాద్-2 డిపో పరిధిలో 59.. మొత్తం 271 బస్సులు నడిపించారు.
కామారెడ్డి జిల్లాలో...
బాన్సువాడ డిపో పరిధిలో 73 బస్సులు, కామారెడ్డి డిపో పరిధిలో 101.. మొత్తం 174 బస్సులు నడిచాయి. మంగళవారం ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సు సేవలను ప్రారంభించారు. డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించి బస్టాండ్‌లో అందుబాటులో ఉంచారు. నిజామాబాద్ నుంచి హైదారాబాద్, బోధన్ నుంచి హైదరాబాద్‌కు బస్సులను ఏర్పాటు చేశారు. త్వరలోనే రాజధాని ఏసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తామని నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోలోమాన్ తెలిపారు.

ఆర్టీసీ కార్మికులకు పలువురు మద్దతు...
ఒకవైపు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను విజయవంతంగా నడిపిస్తుంటే.. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు పలు సంఘాలు, పార్టీలు మద్దతు తెలిపాయి. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా ఆర్టీసీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. నిజామాబాద్ టీచర్స్ జేఏసీ మద్దతు తెలిపింది. ఆర్టీసీ డ్రైవర్ల మృతికి సంతాపంగా పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి తిలక్‌గార్డెన్, బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.

బోధన్ ఆర్టీసీ డిపో నుంచి 70బస్సు సర్వీసులు
శక్కర్‌నగర్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మంగళవారం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు బస్సు సర్వీసులను యథావిధిగా కొనసాగించారు. మంగళవారం ఆర్టీసీ డిపోలో కొనసాగుతున్న 35 అద్దె బస్సులతో పాటు, ఆర్టీసీకి చెందిన 35 బస్సులను వివిధ ప్రాంతాలకు కొనసాగించారు.

ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని మానవహారం
ఖలీల్‌వాడి: ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని వామపక్షాలు, జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ నగరంలోని ధర్నాచౌక్ వద్ద మానవహారంతో పాటు బతుకమ్మ ఆడి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు కమలాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...