అబార్షన్ మాత్రలు వికటించి యువతి మృతి


Tue,October 15, 2019 01:07 AM

రెంజల్ : పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడి కారణంగా గర్భం దాల్చిన యువతి అబార్షన్ మాత్రలు వేసుకోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు, పోలీసులు తలాకొంత నగదు జమ చేసి వైద్యం చేయించారు. కోలుకున్న యువతి అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున విపరీతమైన కడుపునొప్పి రాగా.. 108 వచ్చేలోపే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన భీమయ్య, లక్ష్మికి ముగ్గురు ఆడ సంతానం.రెక్కాడితే కాని ఇల్లు గడవని పరిస్థితి. అద్దె ఇంట్లో ఉంటూ పిల్లలను పోషిస్తున్నాడు. భీమయ్య పెద్ద కూతురు పుయ్యారి రూప (18) బీడీలు చుట్టేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన దాస్ అనే యువకుడితో రూపకు పరిచయం ఏర్పడింది. ఈ వ్యవహారం పెండ్లికి దారితీసింది. దీంతో సదరు యువకుడు రూపకు మాయమాటలు చెప్పి లొంగదీసుకోవడంతో మూడు నెలల గర్భం దాల్చింది. ఈ విషయం దాస్‌కు చెప్పగా.. అబార్షన్ చేయించుకోవాలని సలహా ఇచ్చాడు.

పెండ్లి చేసుకుంటానన్న యువకుడి మాటలు నమ్మిన రూప.. అబార్షన్ మాత్రలు వేసుకుంది. ఆ మాత్రలు వికటించాయి. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో రూప బలహీనంగా తయారైంది. పరీక్షించిన స్థానిక వైద్యులు ప్రాణాపాయం ఉందని, మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం ఖర్చుల కోసం ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదని యువతి తండ్రి భీమయ్య గ్రామ పెద్దలు, పోలీసుల ముందు గోడు వెల్లబోసుకున్నాడు. పరిస్థితిని గమనించిన స్థానికులు, పోలీసులు యువతికి వైద్యం చేయించేందుకు తలాకొంత డబ్బు పోగుచేశారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా.. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న రూపను పోలీసులు సంప్రదించగా.. దాస్ అనే యువకుడు తనను నమ్మించి మోసం చేశాడని, అతని కారణంగానే గర్భం దాల్చగా.. హైపవర్ అబార్షన్ మాత్రలు వేసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు దాస్ తనను పట్టించుకోవడం లేదని వాంగ్మూలం ఇచ్చింది.

యువతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం మేరకు యువకుడిపై కేసు నమోదు చేసిన రెంజల్ పోలీసులు.. దాస్‌ను రిమాండ్‌కు తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న యువతి మూడు నెలలుగా తరుచూ కడుపునొప్పి వస్తుందంటూ తీవ్రంగా బాధపడేది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున కడుపునొప్పి తీవ్రం కావడంతో తల్లిదండ్రులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. ఆ అంబులెన్స్ దూపల్లి చేరుకొనేలోపు యువతి రూప మృతి చెందింది. విషయం తెలుసుకొన్న రెంజల్ ఎస్సై శంకర్ సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. యువతి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై ఆర్.శంకర్ వివరించారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు చెల్లెల్లు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...