ఆర్టీసీ సిబ్బంది సమ్మె సరికాదు..!


Sun,October 13, 2019 01:17 AM

- వేల్పూర్‌ ప్రెస్‌మీట్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నమస్తే తెలంగాణ,నిజామాబాద్‌ ప్రతినిధి/ వేల్పూర్‌ : ప్రజా రవాణా వ్యవస్థను బతికించాలనే తపన సీఎం కేసీఆర్‌దని, వ్యవస్థలు, సంస్థల కన్నా ప్రజలే ప్రభుత్వానికి ముఖ్యమని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలో తన నివాసంలో మంత్రి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. ప్రజల రవాణా సౌకర్యాల కల్పన విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో గాని, ఏ సభలో గాని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదని గుర్తు చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాతే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంపు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు ఆర్టీసీకి ఏం చేసింది?, ఏ ప్రభుత్వాలు ఆర్టీసీకి ఏం చేసిందనే విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నదని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ 44 శాతం ఫిట్‌మెంట్‌ ఒకేసారి ఇచ్చారని గుర్తుచేశారు. 16 శాతం ఐఆర్‌ ఇచ్చామని, రూ. 1.44 పైసలను ఇంకో 16 శాతం పెంచామని, సుమారు రూ.1.70 పైసలు అయ్యేట్లు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, సీఎంగా కేసీఆర్‌ లేనప్పుడు ఒక ఆర్టీసీ ఉద్యోగి జీతం రూపాయి ఉంటే.. ఈ రోజు రూ. 1.70 పైసలు అయ్యిందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నానని, 4,200 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్‌ పద్ధతిలో కొనసాగగా.. వీరిని ఆర్టీసీలో రెగ్యులరైజేషన్‌ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని తెలిపారు.

ప్రతిపక్షాలది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం...
కాంగ్రెస్‌, బీజేపీలకు తాను ఒకే ప్రశ్న వేస్తానని, ఈ దేశంలో 29 రాష్ర్టాలు ఉన్నాయి.. 29 రాష్ర్టాల్లో 17 రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని, 7 రాష్ర్టాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిపాలిస్తున్నదని, వారు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ప్రశ్నించారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో విలీనం చేయకుండా, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని.. ఇది ఎంత వరకు సబబో ప్రజలు గమనించాలని కోరారు. కేరళలో ఉన్న కమ్యూనిస్టులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశా రా? పశ్చిమ బెంగాల్‌లో 30 ఏండ్లు పరిపాలించారు.. అప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తూర్పారబట్టారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌, జార్ఖండ్‌ రాష్ర్టాల్లో అసలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలే లేవని తెలిపారు. అక్కడ మొత్తం వాహనాలను ప్రైవేట్‌ వారే నడిపిస్తారన్నారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది టీఆర్‌ఎస్‌ పార్టీయా? మధ్యప్రదేశ్‌లో ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ అని, అక్కడ అసలు ఆర్టీసీయే లేదని, ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయమంటున్నదని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ అని, అక్కడ ఆర్టీసీ వ్యవస్థ లేదని, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ర్టాల్లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాలేదని స్పష్టం చేశారు. వీరందరూ తెలంగాణలో చిచ్చుపెడుతున్నారని, ఎక్కడైనా సరే.. ఏ సంస్థ అయినా సరే ఉద్యోగులు, కార్మికులు సమ్మె చేస్తే వారి సౌకర్యాల గురించి, వారి ఉద్యోగాల రూల్స్‌ గురించి, అలవెన్స్‌ మ్యాటర్స్‌ గురించో సమ్మె చేస్తారని తెలిపారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల మీద ఏ సంస్థ సమ్మె చేయదని హితవు పలికారు.

ఆర్టీసీకి రూ.3,303 కోట్లు సహాయం చేసిన ప్రభుత్వం..
తెలంగాణ రాష్ర్టాని కన్నా మొదలు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వాలు ఆర్టీసీకి వారు మొత్తం రూ. 1600 కోట్లు మాత్రమే సహాయం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఈ ఐదేండ్లలో రూ. 3,303 కోట్లు సహాయం చేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా, ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా సహాయం చేస్తున్న సందర్భంలో ఆర్టీసీ ఉద్యోగులు మొండి వైఖరితో సమ్మె చేయడం శోచనీయమన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను సాకుగా తీసుకుని చిల్లర రాజకీయాలు చేయాలని భావిస్తున్నారన్నారు.

రైల్వేలైన్లను ప్రైవేట్‌ పరం చేసిన చరిత్ర బీజేపీ ప్రభుత్వనిదే...
ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయొద్దంటూ వక్రభాష్యాలు పలుకుతున్న బీజేపీ.. రైల్వేలైన్లను సైతం ప్రైవేట్‌ పరం చేస్తున్న విషయం ప్రజలకు తెలుసునని మంత్రిఅన్నారు. ఉత్తరప్రదేశ్‌ - లక్నో - ఢిల్లీ రైల్వేలైన్‌ను మోదీ ప్రైవేట్‌పరం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 50వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటున్నదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ. 4,416 కోట్లుగా ఉన్నాయన్నారు. ఆర్టీసీ ఆస్తుల్లో ఇంచు జాగాను కూడా ప్రైవేట్‌కు అప్పగించే ప్రసక్తే లేదని, ఇవన్నీ అబద్ధపు ప్రచారాలని మంత్రి ఖండించారు. ఆర్టీసీ ఆస్తులు ఆర్టీసీ సంస్థ దగ్గరే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్‌ నిరంతరం ఆలోచిస్తారని, 20శాతం ప్రైవేట్‌ బస్సుల ప్రవేశ పెట్టాలనే ఆలోచన కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీ కోసం చేసిందేందన్నారు. ఆర్టీసీలో నడిచే అద్దె బస్సుల ద్వారా ప్రతి కి.మీ కు రూ. 0. 75 పైసలు లాభం వస్తుంటే, ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రతి కి.మీ రూ. 12 నష్టం వాటిల్లుతుందని చెప్పారు. మంచి రవాణా సౌకర్యం, అందరికీ మెరుగైన పౌర సేవలు అందించడం, ప్రతి ఉద్యోగిలో జవాబుదారీ తనం పెంచడం, ఆర్టీసీని బతికించుకొని లాభాల్లోకి తీసుకురావడమనే ధ్యేయంతోనే కేసీఆర్‌ ఆలోచనలు చేస్తున్నారని, దీని కోసమే అందరూ కష్టపడుతున్నారని గుర్తు చేశారు. సమావేశంలో ఎంపీపీలు ఆర్మూర్‌ మహేశ్‌, భీమా జమున, శివలింగ్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్లు దేవేందర్‌, నాగాధర్‌, ఏలియా, దొన్కంటి నర్సయ్య, ఆర్టీఏ సభ్యుడు రేగుల రాములు, వేల్పూర్‌ వైస్‌ఎంపీపీ బోదేపల్లి సురేశ్‌, కమ్మర్‌పల్లి సర్పంచ్‌ గడ్డం స్వామి, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్‌రెడ్డి, కొట్టాల చిన్నారెడ్డి, తుకాజీ తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...