కిరాతకం..!


Sun,October 13, 2019 01:16 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ / దోమకొండ విలేకరి : రక్త సంబంధీకుడే ముగ్గురికి పురుగుల మందుతాగించి కిరాతకంగా బ్లేడ్‌తో గొంతు కోసి హతమార్చిన ఘటన దోమకొండ మండల కేంద్రానికి శివారులోని మల్లన్న దేవాలయం వద్ద శనివారం వెలుగు చూసింది. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా హంతకుడు తోడబుట్టిన తమ్ముడే కావడం అందరినీ చలించి వేసింది. నిందితుడిని పట్టుకుని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఘటనా స్థలిలో వెల్లడించారు.

సంఘటన వివరాలివీ...
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. పరువు కోసం ఓ దుర్మార్గుడు తోడబుట్టిన అన్నను, అన్న కూతురును, రక్తం పంచుకుపుట్టిన బిడ్డను హత మార్చాడు. భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన బందెల బాలయ్య, మణెమ్మకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు దీప కొద్ది రోజుల క్రితమే అదే గ్రామానికి చెందిన నర్సింహులును ప్రేమ వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇష్టం లేని బాలయ్య సోదరుడు బందెల రవి ఎలాగైనా వారిని హతమార్చాలని కక్ష పెంచుకున్నాడు. గ్రామంలో పరువు తీసిందనే కారణంతో కుటుంబంలో అందరినీ చంపి, తాను చస్తానంటూ పలువురికి బహిరంగంగానే చెబుతూ వచ్చాడు. మరోవైపు ప్రేమ జంటను సైతం హతమార్చాలాని నిర్ణయించుకుని సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఇదిలా ఉండగా కసితో రగిలిపోతున్న బందెల రవి గత 20 రోజులుగా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ గ్రామస్తులకు కనిపించకుండానే తిరుగుతున్నాడు. ఊర్లో ఇతర మార్గాల గుండా వెళ్లడం, ముఖానికి ముసుగు ధరించడాన్ని గ్రామస్తులు గమనిస్తూనే ఉండగా శుక్రవారం రోజు తాను బహిరంగంగా చెప్పిన మాటలనే నిజం చేశాడు. మాయమాటలు చెప్పి తన ఆరేళ్ల కూతురు చందన, అన్న కూతురు లత(15), తన సోదరుడు బాలయ్య(42)ను ఊరి చివరకు తన మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకుని తీసుకుపోయాడు. దోమకొండ మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని మల్లన్న దేవాలయం పక్కన మల్లేశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి వ్యవసాయ పొలంలో వారికి పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్స్‌ తాగించాడు. వాళ్లు మత్తులోకి జారుకుంటున్న సమయంలోనే వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. చందన(6), లత(15), బాలయ్య(42)లు మృతి చెందిన తర్వాత హంతకుడు రవి అక్కడి నుంచి బైక్‌తో వెనుదిరిగాడు. దోమకొండ శివారులోని గుండ్ల చెరువు వద్ద రక్తపు మరకలను శుభ్రం చేసుకొని వాహనాన్ని అక్కడే నిలిపి ఇంటికి తిరుగు పయనమయ్యాడు.

బైక్‌ ఆధారంగా నిందితుడి గుర్తింపు...
శుక్రవారం రాత్రి నుంచే బాలయ్య, ఆయన కూతురు లత, రవి కూతురు చందనలు కనిపించక పోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. రాత్రంతా స్థానికుల సహకారంతో గ్రామం చుట్టుపక్కలా వెతికారు. ఎంతకూ ఆచూకీ లభించకపోవడంతో శనివారం ఉదయం మిస్సింగ్‌ కేసు పెడతామని భావించారు. అంతలోనే బందెల బాలయ్య, ఆయన కూతురు లత, చందనలు విగత జీవులై పడి ఉన్నట్లుగా సమాచారం రావడంతో అంతా హతాశులయ్యారు. ఇంటి వద్దనే ఉన్న హంతకుడు రవి మాత్రం తనకేమీ తెలియనట్లుగా నటించాడు. బాలయ్య పెద్ద కూతురు ప్రేమ వివాహం నాటి నుంచి చంపుతానంటూ తిరుగుతున్న రవి పైనే అందరూ అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సైతం గుండ్ల చెరువు వద్ద లభించిన బైక్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టగా మృతుడు బందెల బాలయ్య తమ్ముడు రవికి చెందినదిగా తేలింది. దీంతో పోలీసులు రవిని పట్టుకునేందుకు స్వగ్రామం జంగంపల్లికి వెళ్లేసరికి నిందితుడు పరారయ్యాడు. హంతకుడు రవి భార్య భూలక్ష్మి గర్భవతి కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. మృతుడు బాలయ్య భార్య మణెమ్మ కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బందెల బాలయ్య, రవి ఇరువురూ గ్రామంలో బ్యాండ్‌ మేళాను నిర్వహిస్తున్నారు. ఇదే ప్రధాన వృత్తిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...