జిల్లాలో కోమటిబండ ప్రణాళిక!


Fri,August 23, 2019 04:16 AM

-అటవీ విస్తీర్ణం పెంపుపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక ఆసక్తి
-కలెక్టర్, అధికారులతో చర్చ
-సీఎం ఆలోచన అమలుపై మంత్రి అడుగులు
-ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రతిపాదిత స్థలాన్ని కేంద్ర బృందం పరిశీలించడంపైన ఆరా

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: అడవుల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ మంత్రులు, కలెక్టర్లకు సూచించిన కోమటిబండ కాన్సెప్ట్‌పై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అడవుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సూచించిన మార్గాన్ని జిల్లాలో అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడం, జక్రాన్‌పల్లి వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటు అంశంపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలో అడవుల పునరుద్ధరణపై జిల్లాకేంద్రంలో ఉదయం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలెక్టర్ రామ్మోహన్‌రావు, ఇతర అధికారులతో మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట్ జిల్లాలోని కోమటిబండ వద్ద పెద్ద ఎత్తున చేపడుతున్న అడవుల పునరుద్ధరణను మంత్రులు, కలెక్టర్లకు చూపించి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్ రామ్మోహన్‌రావు, పలువురు అధికారులతో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. సీఎం చేసిన దిశానిర్దేశం ప్రకారం జిల్లాలోనూ అడవుల పెంపునకు సీరియస్‌గా చర్యలు చేపట్టాలని మంత్రి చర్చల ద్వారా అధికారులకు సంకేతాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయడంపై చర్చించారు. అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి ఏ మొక్కలు నాటితే బాగుంటుంది? ఎక్కడెక్కడ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు? అనే అంశాలను పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ అంశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నందున... సీఎం కేసీఆర్ చేసిన సూచనలు, ఆదేశాల అమలుకు ప్రస్తుతం చేపట్టగల చర్యలను గుర్తించాలని సూచించారు. అధికారులతో మంత్రి చేసిన సమీక్ష తరహా చర్చలో జిల్లాలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని, అడవులను పునరుద్ధరించాలనే పట్టుదల మంత్రిలో కనిపించింది. ఆయన అధికారులతో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించడంతో అధికారులు మంత్రి ఆలోచనలకు అనుగుణంగా తగు చర్యలను ప్రారంభించే అవకాశం ఉంది.

ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై వివరాలు అడిగిన మంత్రి...
జిల్లాలో జక్రాన్‌పల్లి వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని బుధవారం కేంద్ర బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే. కేంద్ర బృందం పర్యటన, బృందం మీడియాతో మాట్లాడిన విషయాలపై కలెక్టర్, అధికారులను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో జిల్లా ప్రజలకు కలిగే సౌకర్యం, మేలు గురించి మాట్లాడారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా ఉన్నందున, వారికి ఆ మేరకు ప్రయోజనం కలుగుతుందనే చర్చ జరిగింది. జిల్లా ప్రజలకు కలిగే సౌకర్యమే కాకుండా ప్రభుత్వ పరంగా కలిగే సౌకర్యాలు, ఉపయోగాల పై మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో ప్రభుత్వపరంగా కలిగే సౌకర్యాలతో ప్రజలకు అత్యవసర సందర్భాల్లోనూ సేవలు అందుతాయన్న మంత్రి.. ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చే అంశాల పై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...