విమానాశ్రయం ఏర్పాటుకు జక్రాన్‌పల్లి అనుకూలం


Thu,August 22, 2019 12:22 AM

-జక్రాన్‌పల్లిలో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం అనుకూలం
-మీడియా ఎదుట కేంద్ర బృందం వెల్లడి
-ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ప్రతిపాదిత స్థల పరిశీలన
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పిస్తామని వెల్లడి
-ఏర్పాటైతే జిల్లా అభివృద్ధికి దోహదం : ఎమ్మెల్యే బాజిరెడ్డి

జక్రాన్‌పల్లి : జక్రాన్‌పల్లి మండలంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలం అనుకూలంగా ఉందని కేంద్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో మూడు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు, మూడు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదించింది. అందులో భాగంగానే ఆదిలాబాద్, జక్రాన్‌పల్లిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, పెద్దపల్లిలో గల బసంత్‌నగర్ వద్ద బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టును నిర్మించాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్‌టెన్సీ డీజీఎం అమిత్ మిశ్రా, ఏజీఎంలు నీరజ్ గుప్తా, కుమార్ వైభవ్ జక్రాన్‌పల్లి మండలంలో విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి ల్యాండ్ ఓరియంటేషన్, విండ్ డైరెక్షన్, ల్యాండ్ ఫిజిబిలిటీ వివరాలు సేకరించారు. వీటన్నింటిని అధ్యయనం చేసి ఎయిర్‌పోర్టు ఓరియంటేషన్‌ని నిర్ణయించిన ఆనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని బృందం సభ్యులు తెలిపారు.

స్వాగతం పలికిన ఎమ్మెల్యే బాజిరెడ్డి..
ముందుగా స్థల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులకు జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం జక్రాన్‌పల్లి శివారులోని మనోహరాబాద్, కొలిప్యాక్, తొర్లికొండ గ్రామాల మధ్య విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు ప్రతిపాదిత స్థలంలో పర్యటించి విమానాశ్రయం ఏర్పాటుకు స్థలం అనుకూలంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా డీజీఎం అమిత్ మిశ్రా మాట్లాడుతూ... కేంద్ర విమానయాన శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నూతనంగా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాలను పరిశీలించామన్నారు. పూర్తి నివేదికను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని తెలిపారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...