విలీన గ్రామాలకు మహర్దశ


Wed,August 21, 2019 03:26 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : పట్టణీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల్లో శివారు గ్రామాలను విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కృషి, పట్టుదలతో విలీన గ్రామాల అభివృద్ధికి రూ.30 కోట్ల నిధులను విడుదల చేస్తూ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఉత్తర్వులు జారీఅయ్యా యి. దీంతో ఆర్మూర్ నియోజకర్గంలోని విలీన గ్రామా ల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీనమైన పెర్కిట్, కోటార్మూర్, మామిడిపల్లిల అభివృద్ధికి రూ.20 కోట్లు, నిజామాబాద్ నగర కార్పొరేషన్‌లో విలీనమైన మానిక్‌బండార్, బోర్గాంలకు రూ.10 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి చొరవతో మంజూరైన ఈ నిధులతో విలీన గ్రామాల రూపురేఖలు మారనున్నాయి.

మున్సిపల్‌లో విలీన గ్రామాలకు రూ.20 కోట్లు...
రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిసరాల్లో ఉన్న గ్రామాలకు విలీనం చేయాలనే నిర్ణయంలో భాగంగా ఆర్మూర్ నియోజకర్గంలోని 5 గ్రామాలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్మూరు మున్సిపాలిటీలో కలిసి పోయాయి. నిజామాబాద్ నగర కార్పొరేషన్‌లో మాక్లూర్ మండలంలోని మానిక్‌బండార్, బోర్గాం గ్రామాలు విలీనమయ్యాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఆర్మూర్ మండలంలోని పెర్కిట్, కోటార్మూర్, మామిడిపల్లి గ్రామాలు కలిశాయి. విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలనే సంకల్పంతో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి 5 గ్రామాలకు నిధులు మంజూ రు చేయించాలని మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి తీవ్రంగా కృషిచేశారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో కలిసిన పెర్కిట్, కోటార్మూర్, మామిడిపల్లికి రూ.20 కోట్ల ను, నిజామాబాద్ నగర కార్పొరేషన్‌లో కలిసిన మానిక్‌బండార్, బోర్గాంలకు రూ.10 కోట్ల నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో ప్రధానంగా బీటీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, శ్మశాన వాటికల అభివృద్ధి, పార్కుల నిర్మాణాలు, కమ్యూనీటి హాళ్ల నిర్మాణాలు, సెంట్రల్ లైటింగ్‌లు పనులు చేపట్టనున్నారు. దీంతో విలీన గ్రామాల రూరురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విలీన గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...