వీడీసీలపై విముఖత!


Tue,August 20, 2019 01:46 AM

-గ్రామాభివృద్ధి కమిటీ రద్దు
-గుమ్మిర్యాల్ గ్రామంలో సంచలన నిర్ణయం
-వీడీసీల చరిత్రలో తొలిసారి చుక్కెదురు
-అదే బాటలో మరికొన్ని గ్రామాలు
-సమాంతర వ్యవస్థ పోకడలపై సర్వత్రా చర్చ

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: గ్రా మాభివృద్ధి కమిటీల ప్రాబల్య పరంపరలో తొలిసారి చుక్కెదురైంది. ఆంక్షలతో జులుం చేయడం, చట్టాలను చేతుల్లోకి తీసుకొని సమాంతర వ్యవస్థ పోకడలను అనుసరిస్తున్న వీడీసీలకు కూడా భం గపాటు తప్పదు అనేలా ఏకంగా గ్రామాభివృద్ధి కమిటీ వ్యవస్థనే వద్దు అనే నిర్ణయం గ్రామస్తులు తీసుకోవడం, అందుకు తలొగ్గి గ్రామ కమిటీ స భ్యులు తమ కమిటీనే రద్దు చేసుకుంటున్నట్లు ప్ర కటించిన పరిణామం తాజాగా చర్చనీయాంశమైంది. ఆర్మూర్ డివిజన్‌లోని బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల గుమ్మిర్యాల్ గ్రామస్తు లు తమ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ వ్యవస్థను రద్దు చేయడం సంచలన నిర్ణయమేననే అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. గతంలో కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలతో విభేదించి ప్రత్యేకంగా అభివృద్ధి కమిటీలను వేసుకున్న సం ఘటనలు ఉన్నాయి. కానీ గ్రామాభివృద్ధి కమిటీ వ్యవస్థనే మాకొద్దు అనే నిర్ణయం జరగడం వీడీసీల చరిత్రలోనే ఇది తొలిసారి.

వీడీసీల సమాంతర పాలన..
గ్రామాల అభివృద్ధి, వివాదాలకు ఉనికిగా వీడీసీలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి కోసం అనే దానికంటే వివాదాలు, పెత్తనంలోనే వీటి ఉనికి ఎక్కువగా కనిపిస్తుంది. వీడీసీల ఉనికి చాలా ప్రాంతాల్లో ఉన్నా ఆర్మూర్‌లో వీటి ఉనికి బలంగా కొనసాగుతూ వస్తోంది. వీడీసీల మూలంగా వివాదాలు, గొడవలు, సాంఘిక బహిష్కరణలకు ఆర్మూర్ ప్రాంతం పెట్టింది పేరుగా మారింది. వారన్నదే వేదం, వారు చెప్పిం దే తీర్పు. మాట వినకపోతే అమానవీయ తీర్పులను అమలు చేస్తాయి. సాంఘిక బహిష్కరణలు విధించి కుంగదీస్తాయి. జరిమానాలు విధించి కడతావా..? ఊరు విడిచి వెళతావా? అం టాయి. చివరకు మూఢ విశ్వాసాలను గుడ్డిగా నమ్మి మంత్రాల నెపంతో మనుషులను చింత బరిగెలతో కొడతాయి. గ్రామ సహజ వనరులను ఊరి ఆదాయం పేరిట కొల్లగొడతాయి. అభివృద్ధి కోసం బెల్టు షాపుల వేలం నిర్వహిస్తాయి. గ్రామాల్లో వాగులు, వంకలు, ఒర్రెల్లో ఇసుక వనరులను హస్తగతం చేసుకొని ఇసుకను ప్రియం చేస్తాయి. ఆడవాళ్ల శీలానికి వెలకడతాయి.

వారిదంతా ఇష్టారాజ్యం..
ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులను లెక్క చేయవు. తమ తర్వాతే మీరు అంటాయి. వారి పైనా హుకుం చేస్తాయి. సర్పంచులపై కూడా సాంఘిక బహిష్కరణలు విధిస్తాయి. చివరకు ఎమ్మెల్యేలను కూడా తమ గ్రామంలోకి రావొద్దని తీర్మానాలు చేస్తూ రాజకీయాలు చేస్తాయి. అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధుల విధుల్లో జోక్యం చేసుకుంటూ సమాంతర అధికార వ్యవ స్థ తమది అంటాయి. గొడవలకు, వివాదాలకు ఆజ్యం పోస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా కూడా చేస్తాయి. దళితుల భూముల మీ దపడి దళిత కుటంబాలకు సామూహిక, సాం ఘిక బహిష్కరణలు విధిస్తాయి. గ్రామాల్లో పలుకుబడి కలిగిన, సంపన్న వర్గాల చెప్పు చేతల్లో నడుస్తాయి. వీడీసీలు ఇలాంటి చర్యలన్నీ జిల్లా లో, ప్రధానంగా ఆర్మూర్ డివిజన్‌లో చోటు చేసుకున్నవే.

ఇకనైనా వీడీసీల వ్యవస్థకు అడ్డుకట్ట పడేనా..?
మాట, డబ్బు, పలుకుబడి ఉన్న వర్గాల చెప్పు చేతల్లో ఉండి తమను అణిచివేస్తున్నారని వీడీసీలను ఎదురించి ప్రత్యేక కమిటీల పేరిట, ఆదర్శ కమిటీల పేరిట, రెండో కమిటీల పేరిట కమిటీలు వేసుకున్న గ్రామాలున్నాయి. కానీ తమ గ్రామం లో గ్రామాభివృద్ధి కమిటీ వ్యవస్థనే వద్దు అనే నిర్ణయం మాత్రం గ్రామాభివృద్ధి తొలిసారి గుమ్మిర్యాల్‌లో జరిగింది. ఏవేని గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ద్వారా ని ర్వహించుకుంటే సరిపోతుందని, అనవసర వివాదాల గ్రామాభివృద్ధి కమిటీ వ్యవస్థ అవసరమా? అని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గుమ్మిర్యాల్ గ్రామంలో మత్స్యకారులపై ఆంక్షల ఆరోపణలతో తలెత్తిన వివాదం గ్రామాభివృద్ధి కమిటీ వ్య వస్థ రద్దుకు దారి తీసింది. స్వయంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కూడా ఇక గ్రామాభివృద్ధి కమిటీని రద్దు చేసుకుంటున్నామని పోలీసులతో స్పష్టం చేశారు. గతంలో ఎన్నో గ్రామాల్లో ఎన్నో వివాదాలకు, గొడవలకు కారణమైన వీడీసీలు వెనక్కి తగ్గాయే కానీ ఎక్కడా ఈ వ్యవస్థనే వద్దనే ఆలోచన రాలేదు. తొలిసారి కలిగిన ఆలోచనను పరిశీలకులు, వీడీసీల వ్యవస్థను వద్దనే వారు, పో లీసులు ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...