విమానాశ్రయం ఏర్పాటుకు రెక్కలు!


Thu,August 15, 2019 03:30 AM

- రాష్ట్రప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయంతో మళ్లీ ఆశలు
- బలమిస్తున్న పరిణామాలు
- జక్రాన్‌పల్లి వద్ద అందుబాటులోకి వస్తే నాలుగు జిల్లాలకు సేవలు
- పదేండ్ల కిందటే స్థల సేకరణ
- ప్రభుత్వానికి నివేదిక పంపిన జిల్లా అధికారులు

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ/జక్రాన్‌పల్లి: జిల్లాలో పదేండ్లుగా ఆశలు రేకెత్తిస్తున్న విమానాశ్రయ ఏర్పాటుకు మళ్లీ రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాల ఏర్పాటుకు అడుగులు పడుతుండడంతో ఇందుకు ఊతమిస్తోంది. పెరుగుతున్న ప్రయాణ అవసరాల దృష్ట్యా ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయానికి వచ్చింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పథకం ఉడాన్ కింద వీటిని నిర్మించాలని యోచిస్తోంది. కొన్నేండ్లుగా విమానాశ్రయ ఏర్పాటు అంశం జిల్లాలో నానుతున్నది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయానికి రావడం మరింత బలాన్నిస్తోంది.

ఈ నెలలో పరిశీలనకు వచ్చే అవకాశం...
విమానాశ్రయ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేసి విమానాశ్రయం ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలపై సెప్టెంబరు చివరలో నివేదిక అందజేయనున్నారు. దాని ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ విధానాన్ని రూపొందిస్తాయి. అందులో భాగంగా జిల్లాలో ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండి యా అధికారులు పర్యటించనున్నట్లు తెలిసింది.

ఉమ్మడి రాష్ట్రంలోనే బీజం...
2004 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్. రాజశేఖర్‌రెడ్డి నిజామాబాద్ సమీపంలో ఉన్న బా సర వద్ద ట్రిపుల్‌ఐటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వా త 2006లో తెలంగాణ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలు పరిశీలించి స్థలం సేకరించాలని అధికారులను ఆదేశించారు. అదే తడువుగా ఉన్నతాధికారులు నిజామాబాద్ పక్కనున్న సారంగాపూర్, జక్రాన్‌పల్లి పరిధిలో అనువైన స్థలాల కోసం అన్వేషించారు. జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండ, అర్గుల్, కొలిప్యాక్, మనోహరాబాద్ గ్రామాల మధ్య ఉన్న అసైన్డ్, పట్టా స్థలాల్లోని 2వేల ఎకరాలను గుర్తించి నివేదికను అందజేశారు. విమానాశ్రయ ఏర్పాటుకు జక్రాన్‌పల్లి అనుకూలమని భావించారు.

పదేండ్ల కిందటే స్థలం ఎంపిక...
2006లో అప్పటి సీఎం వైఎస్‌ఆర్ హయాంలో నిజామాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు ఆదేశించడంతో అప్పట్లో స్థల ఎంపిక, సేకరణ పెద్ద సమస్యగా మారింది. అయితే అప్పటి జిల్లా ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన స్థలం జక్రాన్‌పల్లి వద్ద గుర్తించారు. ఇక్కడ కొండలు, చెరువులు, లోయలు లేని మైదాన ప్రాంతం కావడంతో మొదటి నుంచి ఇక్కడే ప్రతిపాదన కొనసాగుతోంది. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్, తొర్లికొండ, కొలిప్యాక్, అర్గుల్ గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న 1,200 ఎకరాల అసైన్‌మెంట్, 800 సాధారణ, మరో 1,400 ఎకరాల ప్రభుత్వ భూమి సరిపోతుందని అధికారులు నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే స్థల సేకరణ పూర్తిచేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. ప్రస్తుతం స్థల విషయంలో ఎలాంటి సమస్య లేదనే చెప్పవచ్చు.

గతేడాది పరిశీలన..!
విమానాశ్రయ ఏర్పాటు కోసం గతేడాది రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ నర్సింహారెడ్డి ప్రతిపాదిత స్థల పరిశీలినకు వచ్చారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. రానున్న కొద్ది రోజుల్లో విమానాశ్రయం ఏర్పాటు కానుందనే ఆశ మళ్లీ రేకెత్తిస్తోంది.

ఉపయోగమెంతో..!
- ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయపరంగా బాగా అభివృద్ధి చెందిందనే పేరుంది. అందుకు తగ్గట్టుగానే వ్యాపారులు, విద్యావేత్తలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉంటుంది. ట్రిపుల్ ఐటీ, తెలంగాణ యూనివర్సిటీలకు దేశవిదేశాల నుంచి వచ్చేందుకు ఇక్కడ విమానాశ్రయం ఏర్పడితే ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అంతేకాకుండా..
- ఆర్మూర్ ప్రాంతం ఎర్రజొన్న, పసుపు వంటి వాణిజ్య పంటల సాగుకు ఖ్యాతిగాంచింది. వీటిని కొనుగోలు చేసేందుకు దేశ రాజధాని ఢిల్లీ నుంచి వ్యాపారులు వస్తుంటారు.
- ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీహబ్ ఏర్పాటు నేపథ్యంలో ఐటీ సంస్థల ప్రతినిధులకు, ఉద్యోగులకు ఎంతో వెసులుబాటు.
- ప్రధానంగా గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లే యువతకు, ఇతర దేశాలకు రాకపోకలు సాగించే వ్యాపారులకుకు ఎంతో మేలు చేయనుంది.

ఏర్పాటుకు అనుకూలాంశాలు..
- ఉమ్మడి జిల్లాలో 44వ నంబరు జాతీయ రహదారి విస్తరించి ఉంది.
- ఇటు హైదరాబాద్ గ్లోబల్ సిటీకి.. అటు మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్ మధ్యన ఉండడం అనుకూలించే అంశం.
- డిచ్‌పల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఉండడం.
- శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉండడం
- బాసర ట్రిపుల్ ఐటీకి దగ్గరగా ఉండడం..
- కొండలు, ఎత్తుపల్లాలు లేని మైదాన ప్రాంతం కావడం.
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పాత ఆదిలాబాద్, కరీంనగర్ జల్లాలకు అందుబాటులో ఉండడం

ఏర్పాటుకు అనుకూలతలు ఉన్నాయి..
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రన్‌పల్లి మండలంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం చాలా రోజులుగా ప్రక్రియ కొనసాగుతోంది. విమానాశ్రయం ఏర్పాటు చేస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాల ఏర్పాటుకు అడుగులు పడుతుండడంతో జిల్లాలో ఆశలు రేకెత్తిస్తుంది. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఇక్కడ అన్ని అనుకూలతలు ఉన్నాయి. విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, నిత్యం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ఏర్పడుతుంది.
-బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...