నీలి విప్లవం


Wed,August 14, 2019 01:44 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా ప్రోత్సాహ్నా అందిస్తున్నది. గత పాలకుల హయాంలో తెలంగాణలో మత్స్యకారులకు ఆశించిన ప్రోత్సాహం దక్కలేదు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కులవృత్తులకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. కులవృత్తుల ద్వారా సంపదను సృష్టించి, ఆ వృత్తుల వారి జీవితాల్లో వెలుగు నింపే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు అందిస్తూ వస్తోంది. అందులో భాగంగా మత్స్యకారులకు ఉచితంగా చేపల పిల్లల పంపిణీతో పాటు వారి అభివృద్ధికి చర్యలు చేపట్టింది. మూడేండ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు చేయూతనిచ్చే కార్యక్రమాలు ప్రారంభించింది. తాజాగా నాలుగో విడత చేప పిల్లల పెంపకానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16న చేప పిల్లల విడుదలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో మత్స్యశాఖ అధికారులు ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసిం గ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా బాల్కొండ నియోజకవర్గంలో ఈనెల 16న చేప పిల్లల విడుదల కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడో విడత కింద మొత్తం రూ. 4 కోట్ల విలువ చేసే 5 కోట్ల చేప పిల్లలను పెంచేందుకు టెండర్లు నిర్వహించారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కట్ల, రోహు, మృగాల చేప పిల్లలను పోచంపాడ్‌తో పాటు చెరువుల్లో పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. గతేడాది 4.18 కోట్ల చేప పిల్లలను 714 చెరువుల్లో పెంచారు. ఈసారి 800 చెరువుల్లో చేపపిల్లల పెంపకం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల విస్తారంగా వర్షాలు కురియడంతో చెరువుల్లోకి భారీగా నీరు చేరింది. ఈ మేరకు నిండిన చెరువుల్లో చేపపిల్లల పెంపకాన్ని చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

గణనీయంగా పెరిగిన చేపల ఉత్పత్తి...
రెండు విడతల్లో నిజామాబాద్ జిల్లాలో వందలాది చెరువుల్లో, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఉచితంగా చేప పిల్లలను వదిలింది. జిల్లాలోని 342 నీటి పారుదల చెరువుల్లో, 491 పంచాయతీరాజ్ చెరువుల్లో, ఎస్సారెస్పీ ప్రాజెక్టులో 2017-18 సీజన్‌కు గాను రూ. 2.50 కోట్ల ఖరీదుతో 2.67 కోట్ల చేప పిల్లలను విడుదల చేసింది. ఈ రెండేండ్లలో దశల వారీగా చెరువులు, ప్రాజెక్టుల్లో చేపల ఉత్పత్తి పెరుగుతూ వస్తున్నది. 2018 మార్చి వరకు జిల్లాలో 12,108 టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. దీని ద్వారా మత్స్యకారులకు రూ. 96కోట్ల రాబడి వచ్చింది. జిల్లాలో పురుష మత్స్యకార సంఘాలు 245, మహిళా మత్స్యకార సంఘాలు 29 ఉన్నాయి. ఈ సంఘాలు అన్నింటిలో ఉన్న 17,156 మంది మత్స్యకారులకు ఈ మేరకు రాబడి లాభం చేకూరింది. ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో చేపల ఉత్పత్తి వివరాలు ఇంకా లెక్కకట్టాల్సి వుంది. ఈ మూడు మాసాల్లో సుమారు మరో రూ. 10 కోట్ల రాబడి ఉండవచ్చని మత్స్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ప్రభు త్వం మత్స్యకారులకు ప్రోత్సాహక కార్యక్రమాలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 106 కోట్ల ఆదాయం సమకూరిందని మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు జిల్లాలో మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగపడే కేజ్‌కల్చర్ యూనిట్లు కొనసాగుతున్నాయి. ఎడపల్లి మండలం ఠాణాకలాన్ అలీసాగర్ చెరువులో, ముప్కాల్ మండలం రెంజర్ల ఊర చెరువులో, నందిపేట్ మండలం వెల్మల్‌లోని గంగా చెరువులో కేజ్‌కల్చర్ యూనిట్లు కొనసాగుతున్నాయి. ఒక్కో చెరువులో 30వేల చేప పిల్లల పెంపకం కొనసాగుతున్నది. ఒక్కో యూనిట్ విలువ రూ.30లక్షలు ఉంటుంది. ఇందులో కేజ్‌కల్చర్ యూనిట్ నిర్వహించుకుంటున్న సంఘానికి రూ. 24 లక్షల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. ఈ గణాంకాలు జిల్లాలో మత్స్య సంపద వృద్ధి చెందిందనే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...