విలీన గ్రామాలకు మహర్దశ


Wed,August 14, 2019 01:42 AM

ఇందూరు: నిజామాబాద్ నగర పాలక సంస్థలో విలీనం చేసిన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నగర పాలక సంస్థ పరిధిలో చేర్చిన గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులొ భాగంగా విలీన గ్రామాల అభివృద్ధికి రూ.26.85 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. విలీన గ్రామాలైన కాలూరు, ఖానాపూర్, సారంగాపూర్, గూపన్‌పల్లి, పాంగ్రా, బోర్గాం(పీ), బోర్గాం(కే), మానిక్‌బండార్, ముబారక్‌నగర్ గ్రామాల్లో పారిశుధ్యం, రోడ్లు, ఉద్యానవనాల ఏర్పాటు, డ్రైనేజీల నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు రూ.26 కోట్ల 85లక్షలు విడుదల చేస్తూ మున్సిపల్ శాఖ అధికారులు జీవో జారీ చేశారని నగర పాలక సంస్థ కమిషనర్ జాన్ సాంసన్ తెలిపారు.

మారనున్న విలీన గ్రామాల రూపురేఖలు...
విలీన గ్రామాల అభివృద్ధికి రూ.26.85 కోట్లు మంజూరు కావడంతో ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగు పడనున్నాయి. ఆయా గ్రామాల్లో రోడ్లు, మురుగు కాల్వలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, సీసీ రోడ్లు వంటి వాటికి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ నిధులతో విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగనున్నాయన్నాయి. గ్రామాల జనాభా ప్రాతిపాదికన ఈ నిధులను ఆయా గ్రామాలకు కేటాయించనున్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విలీన గ్రామాల అభివృద్ధి ఆగకూడదనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీలిన గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఇప్పటికే నగర పాలక సంస్థ అధికారులు నివేదికలు రూపొందించారు. వాటి ఆధారంగా అభివృద్ధి పనులకు గాను ఈ మొత్తాన్ని కేటాయిస్తూ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విలీన గ్రామాల్లో పాలక వర్గాలు లేకపోవడంతో ఆయా గ్రామాలకు నోడల్ అధికారులను నియమించారు.

జాబితాను సిద్ధం చేసే పనిలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు...
మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి అధికారులు ఈ నిధులకు సంబంధించి జీవో విడుదల చేశారు. తెలంగాణ అర్బన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ విలీన గ్రామాలకు నిధులు కేటాయించింది. ఇక నుంచి నగరంలోని ఆయా డివిజన్‌లలో జరిగినట్లుగానే విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరందుకోనున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు ఆయా గ్రామాల్లో పనుల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. టెక్నికల్ సాంక్షన్ రాగానే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పనుల జాబితా అంచనా వ్యయం చేస్తున్నామని నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పాంగ్రా మీదుగా ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నామన్నారు. ఇందుకు గాను రూ.6.50 కోట్లు కేటాయించారు.

విలీన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం..
పట్టణీకరణలో భాగంగా శివారు గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రభుత్వం విలీనం చేసింది. ప్రస్తుతం వాటి అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. ఆ గ్రామాలకు ప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తున్నది. వాటిని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. గ్రామాలను కలపడమే కాదు పట్టణాల మాదిరిగా వాటిని తీర్చిదిద్దేందుకు రోడ్లు, డ్రైనేజీలు, కావాల్సిన సదుపాయాలు ఏర్పాట్లు చేసేందుకు ఈ నిధులను కేటాయించారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...