పునరుజ్జీవానికి అంతా రెడీ


Sat,August 10, 2019 02:07 AM

-ఎస్సారెస్పీలోకి రోజుకుఅర టీఎంసీ చొప్పున నీరు పంపింగ్‌కు అంతా రెడీ
-ముహూర్తం ఖరారు..
-ఈనెల 15 నుంచి 20లోపు రివర్స్ పంపింగ్‌కు ఏర్పాట్లు
-సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
-ఫలించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి కృషి
-పనులు ప్రారంభమై నేటితో రెండేండ్లు
-ఎస్సారెస్పీకి ఇక పూర్వ వైభవం
-వ్యవసాయ రంగానికి

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం తొలి ఫలితం అందే తరుణం ఆసన్నమైంది. దీనికోసం సర్వం సిద్ధమైంది. ముహూర్తం ఖరారైంది. పునరుజ్జీవ పథకంలో రెండు పంపుహౌస్‌లు రోజుకు అర టీఎంసీ చొప్పున నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పంపింగ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. ప్యాకేజీ-8లో భాగమైన లక్ష్మి సర్జిపూల్ వద్ద నాలుగైదు రోజుల్లో వరద కాలువకు నీటి విడుదల కాగానే పునర్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాల తరలింపు ప్రారంభం కానుంది. ఈనెల 15 నుంచి 20లోపు రివర్స్ పంపింగ్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో మాదిరిగా ప్రాజెక్టుల నిర్మాణమంటే పదేండ్లు, ఇరవై ఏండ్లు కాలం పట్టేది. అలా కాకుండా నాలుగేండ్లు, ఐదేండ్లలో వీటిని పూర్తి చేసి వాటి ఫలితాలు రైతులకు అందించాలనే సీఎం కేసీఆర్ అభిమతం నిజమైంది. ఇందుకు నిదర్శనంగా పునరుజ్జీవ పథకం రెండేండ్లలోనే తొలి ఫలితం ఇవ్వనుంది. ఈ పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి నేటితో సరిగ్గా రెండేండ్లు కావస్తున్నది. ఎస్సారెస్పీకి పూర్వవైభవం తెచ్చేందుకు చేపట్టిన పునరుజ్జీవం పథకం గురించి అందిస్తున్న కథనమిది.

కేసీఆర్ మానస పుత్రిక పునరుజ్జీవ పథకం...
కాలక్రమేణా పూడిక చేరికతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 90టీఎంసీలకు తగ్గిపోయింది. ఈ స్థితిలో కాకతీయ కాలువ ద్వారా 4.60లక్షల ఎకరాలకు 46 టీఎంసీలు, సరస్వతి కాలువ ద్వారా 36వేల ఎకరాలకు 3.5 టీఎంసీలు, ప్యాకేజీ 27, 28 ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు లక్ష ఎకరాలకు 7టీఎంసీలు, లక్ష్మీ కాలువ, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాల కింద 36వేల ఎకరాలకు 4 టీఎంసీలు, గుత్ప, అలీసాగర్ లిఫ్టుల కింద 93వేల ఎకరాలకు 7.3 టీఎంసీలు, ప్యాకేజీ-21, 22 కింద నిజామాబాద్ జిల్లాలో 4.40లక్షల ఎకరాలకు 33 టీఎంసీలు, భగీరథతో సహా, ఇతర తాగునీటి పథకాలకు 14.5 టీఎంసీలు, ఐడీసీ ఎత్తిపోతల పథకాల కింద 80వేల ఎకరాలకు 7.7 టీఎంసీలు అవసరం అవుతున్నాయి. మొత్తం కలిపి 12.45 లక్షల ఎకరాలకు 123 టీఎంసీల నీటి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ పరిష్కరించాలంటే పునరుజ్జీవ పథకం అవసరమని సీఎం కేసీఆర్ గుర్తించారు. అందుకే పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు.

పనులు వడివడిగా కొనసాగి రెండేండ్ల కాలంలోనే ఫలాలందించే దిశగా పూర్తయ్యాయి. తెలంగాణలో గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఎస్సారెస్పీ ఎగువన నీరు లేక వెలవెలబోతుండగా... దిగువన ఏటా వందలాది టీఎంసీల జలాలు వృథాగా దిగువకు వెళ్లిపోయేవి. ఈ పరిస్థితిని గత ప్రభుత్వాలు కండ్లు అప్పగించి చూశాయే గానీ, ఎస్సారెస్పీకి నీటి లభ్యతకు మరోమార్గం గురించి ఆలోచించలేదు. ఎస్సారెస్పీకి పూర్వవైభవం కల్పించాల్సిన ఆవశ్యకతను సీఎం కేసీఆర్ గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ఆయన.. ఎస్సారెస్పీకి పునరుజ్జీవ పథకాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి రూపొందించారు. రూ.1,080 కోట్లతో చేపట్టిన ఈ పథకానికి 2017 ఆగస్టు 10న ఎస్సారెస్పీ వద్ద శుంకుస్థాపన చేశారు. రోజుకు టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 60 టీఎంసీల కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీకి తరలించేలా పునరుజ్జీవ పథకాన్ని రూపొందించారు.

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం జిల్లాకు వరంలాంటిది. ఎస్సారెస్పీకి ఎగువ నుంచి వచ్చే వరదకు రివర్స్ పంపింగ్‌తో కాళేశ్వరం జలాలు తోడై జిల్లాను సస్యశ్యామలం చేయనున్నాయి. జిల్లాలో వరద కాలువ , కాకతీయ కాలువ మూడు కాలాలు నీళ్లుండే మినీ రిజర్వాయర్లుగా మారుతాయి. లక్ష్మి, కాకతీయ కాలువ కింద ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లు అందుతాయి. కాళేశ్వరం ప్యాకేజీ-21 ద్వారా ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌ను తరలించి బాల్కొండ నియోజకవర్గంలో 72 వేల ఎకరాలకు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1.18 లక్షల ఎకరాలకు, ఆర్మూర్ నియోజకవర్గంలో 6వేల ఎకరాలకు నీరందిస్తారు. కాళేశ్వరం ప్యాకేజీ-21 పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పునరుజ్జీవ పథకంతో జిల్లాలో ఎస్సారెస్పీ సహా చెరవులకు నీటి కొరత తీరిపోయి మత్స్య పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందనుంది.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...