మున్సిపోల్స్‌కు యంత్రాంగం సిద్ధం


Wed,July 17, 2019 06:15 AM

ఖలీల్‌వాడి : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అన్నారు. ప్రగతిభవన్‌లో మంగళవారం సాయంత్రం కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా నియమించిన ఆర్వో, ఏఆర్వో అధికారులతో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎంతో క్రియాశీలకంగా బాధ్యతాయుతంగా పని చేసి సజావుగా జరిగేందుకు దోహదపడాలన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమాలన్నీ స్వయంగా పాటించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్‌లో నిర్దేశించిన ప్రకారం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, గుర్తుల కేటాయింపు , పోలింగ్ ఫలితాలు జారీ చేసే వరకు పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారిదేనని వెల్లడించారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఆదేశాలను పాటించి ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల్లో ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండవని, ప్రొసీజర్ ప్రకారం బాధ్యతలను చేపట్టాలన్నారు. ఈ ఎన్నికలు మున్సిపల్ , కార్పొరేషన్ చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడతాయన్నారు. రాజ్యాంగబద్ధ ఎన్నికల సంఘం సమయానుకూలంగా జారీ చేసే ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని కార్పొరేషన్, మున్సిపాలిటీల చట్టం ప్రకారం కొన్ని నిర్దేశించిన అంశాలు కొంచెం తేడా ఉండవచ్చన్నారు.

సమయానుకూలంగా నామినేషన్లు స్వీకరించాలి
నామినేషన్ల స్వీకరణకు నిర్దేశించిన ప్రదేశాల్లో సమయానుకూలంగా రిటర్నింగ్ అధికారులు స్వీకరించాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అన్నారు. నగరపాలక సంస్థలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మున్సిపాలిటీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలన్నారు. కౌన్సిలర్‌గా పోటీ చేసే ఇతర అభ్యర్థులు రూ.5వేలు డిపాజిట్ చెల్లించాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2500 చెల్లించాలని తెలిపారు. నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి గదిలోకి నామినేషన్ వేసే అభ్యర్థితో పాటుగా మరో ఇద్దరికీ మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకే వాహనం అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల కోసం నియమించబడ్డ పీవో, ఏపీవోలకు ఈ నెల 17వ తేదీన శిక్షణ తరగతులు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్ నియమింబడ్డ పీవో, ఏపీవోలకు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో, బోధన్ ఉర్దూఘర్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో నియమించిన వారికి ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళాక్షేత్రంలో నిర్వహిస్తామని, ఈ శిక్షణ తరగతులకు సకాలంలో హాజరుకావాలన్నారు.

అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలి..
నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ జాన్ సాంసన్ అన్నారు. కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఆదేశాలను లోక్‌ల్‌బాడీ ఎలక్షన్ సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి, నిజామాబాద్ ఎంపీడీవో సంజీవ్ ఎన్నికల నియమ నిబంధనలు, ప్రవర్తన నియమాలు ఆర్వోల బాధ్యతలు, విధులను వివరించారు. సమావేశంలో ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...