సమస్యల వలయంలో గురుకుల బాలికల పాఠశాల


Wed,July 17, 2019 06:13 AM

ఎల్లారెడ్డి రూరల్: పాఠశాల పరిసరాలకు వెళ్తేనే భరించరాని దుర్గంధం, పాఠశాలలో అడుగుపెడితే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఎల్లారెడ్డి గిరిజన గురుకుల బాలికల పాఠశాలది. 150 మంది విద్యార్థులు ఉండడానికి వీలయ్యే భవనంలో 470 మంది విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ 25, సిబ్బంది మరో 25 మంది మొత్తంగా పాఠశాలలో 520 మంది ఉండడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాలలోని మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో ఎక్కడికక్కడ నిండిపోయి పాఠశాల పరిసర ప్రాంతాలు విపరీతమైన దుర్గంధంతో నిండిపోయాయి. గత ఏడాది ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలలో 200 మంది సంఖ్య ఉండగా తరగతులు పెరడగం, గురుకులాలపై ప్రజల్లో ఏర్పడిన నమ్మకంతో ఈ సంవత్సరం ఆ సంఖ్య 470కి చేరింది. టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందితో కలిసి అదికాస్తా 520కి చేరడంతో సమస్యలు పరాకాష్టకు చేరుకున్నాయి. 200 మంది విద్యార్థులు ఉన్న సమయంలోనే చాలీచాలని సౌకర్యాలతో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగినా సౌకర్యాలు పెరగకపోవడంపై విద్యార్థినులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను తగ్గించడానికి సోమార్‌పేట్ బేస్‌లో ఆల్ఫా పాఠశాల భవనాన్ని రెంట్ తీసుకొని కొద్ది మంది విద్యార్థినులను అక్కడికి తరలించడంతో వారి పరిస్థితి పెనంపై నుంచి మంటలో పడ్డట్టయింది. ఆల్ఫా పాఠశాలకు వెళ్లే మార్గంలో వీధి దీపాలు, ప్రహరీ లేకపోవడం, పరిసర ప్రాంతాలలో ముళ్లచెట్లు, పొదలు, తుప్పలు ఉండడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయినులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో మంగళవారం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలకు ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్ మహిపాల్ పరిశీలించారు. ప్రిన్సిపాల్ సునీత, సిబ్బందితో మాట్లాడిన ఆర్డీవో పాఠశాలలో నిండిపోయిన దుర్గంధం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అప్పటివరకు అన్ని రకాల సౌకర్యాలున్న భవనాన్ని అద్దెకు తీసుకొని పాఠశాలను తరలిద్దామన్నారు. 520 సంఖ్యకు సరిపడా భవనం ఎల్లారెడ్డి పట్టణంలో లేదని అప్పటి వరకు ఎల్లారెడ్డి శివారులోని బాలాజీనగర్ తండా వద్ద కొత్తగా నిర్మించిన ఆదర్శ డిగ్రీ కళాశాల బాలికల వసతిగృహం ఖాళీగా ఉన్నందున తమను అక్కడికి తరలించాలని ప్రిన్స్‌పాల్, సిబ్బంది ఆర్డీవోను కోరారు. మరో ఆరు నెలల్లో ఎస్టీ గురుకుల బాలికల పాఠశాలకు సొంత భవనం పూర్తి అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...