వీడని ఉత్కంఠ!


Mon,July 15, 2019 02:38 AM

బోధన్‌, నమస్తే తెలంగాణ : రానున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పురపాలక సంఘాల తుది ఓటర్ల జాబితా, ఆ జాబితాలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వివరాల ప్రచురణ ఆదివారం జరగాల్సి ఉండగా.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈనెల 16కు వాయిదా పడింది. దీంతో జిల్లాలోని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితా, అందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల వివరాల తుది జాబితాల ప్రచురణ జరగలేదు. కామారెడ్డి మున్సిపాలిటీలో వివిధ వర్గాల గణనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తుది జాబితాల రూపకల్పన మరింత పకడ్బందీగా ఉండాలన్న ఉద్దేశంతోనే మరో రెండు రోజుల గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో ఈ నెల 10న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించారు. అంతకుముందే, గత నెలాఖరున బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్ల వారీగా జరిగింది.

ఆ గణన వివరాలను తాజాగా పునర్విభజించిన వార్డుల్లోకి ఏ వర్గం వారు ఎంతమేరకు ఉన్నారన్న విషయమై తేల్చేందుకు.. మున్సిపల్‌ యంత్రాంగం తీవ్రమైన కసరత్తే చేసింది. గత నెలాఖరున జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణనకు ఓటర్ల జాబితాలను టీపోల్స్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా తీసుకోవడం, ఆ తర్వాత కూడా ఓటర్ల నమోదు జరిగిన నేపథ్యంలో ఓటర్ల సంఖ్య పెరగడం లేదా తగ్గడం కారణంగా కొంత గందరగోళం ఏర్పడింది. దీంతో అనేక మున్సిపాలిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను కొత్తగా ఏర్పడిన వార్డుల్లో సరిచేయడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఓటర్ల ముసాయిదా జాబితాలను నామ్‌ కే వాస్తేగా ప్రచురించారని, అనేక తప్పులు దొర్లాయన్న విమర్శలు వినిపించాయి. తుది ఓటర్ల జాబితాలో ఈ తప్పులను సరిదిద్దడానికి మున్సిపల్‌ యంత్రాంగం ఒకింత కష్టపడక తప్పలేదు. ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రచురణకు మరో రెండు రోజులు గడువు లభించడంతో మున్సిపల్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు రోజుల్లో ఓటర్ల జాబితాల్లో ఏవైనా పొరపాట్లు జరిగాయా అన్న విషయాన్ని మరోసారి వెరీఫై చేసుకునే అవకాశం లభించింది.

తీవ్రమైన పని ఒత్తిడితోనే...
మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం జరగాల్సిన అన్ని ప్రక్రియల షెడ్యూళ్లను కుదించడం, ముందుగా నిర్ణయించిన తేదీలను ఇంకా ముందుకు జరపడంతో మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిపై ఒక్కసారిగా ఒత్తిడి పడింది. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ ముందస్తుగా జరపాలన్న నిర్ణయంతో అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేయాల్సి వచ్చింది. పైగా గ్రామాల విలీనంతో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీల విస్తీర్ణం పెరగడంతో వార్డుల పునర్విభజన కత్తిమీద సాములా మారింది. అంతకుముందే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన హడావిడిగా చేస్తుండగానే, వార్డుల పునర్విభజన పని ఒత్తిడి పెరిగింది. వార్డుల పునర్విభజన పని పూర్తయిందో.. లేదో ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రచురించాల్సి వచ్చింది. కొత్త వార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను సరిచేయడం కోసం తీవ్రమైన కసరత్తు చేశారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆదివారమే ఓటర్ల తుది జాబితాల ప్రచురణ జరిగి ఉన్నట్లయితే.. వాటిలో తప్పులు దొర్లే అవకాశం ఉండేదని మున్సిపల్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని కొంత మంది మున్సిపల్‌ కమిషనర్లు పురపాలక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. తుది జాబితాల్లో తప్పులు వచ్చినట్లయితే, వాటి ఆధారంగా అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ కొందరు కోర్టులను ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. ఇదంతా దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర పురపాలక శాఖ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితా ప్రచురణ గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించినట్లు చెబుతున్నారు.

వీడని ఉత్కంఠ.. కొనసాగుతున్న ఊహాగానాలు..
మున్సిపల్‌ ఎన్నికల ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఆదివారం జరుగుతుందని, తద్వారా తమ తమ వార్డులో ఏ వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయన్న విషయమై స్పష్టత వస్తుందని భావించిన ఆశావహులు... మరో రెండు రోజులపాటు వేచిచూడక తప్పదు. దీంతో వివిధ వర్గాల ఓటర్ల ఆధారంగా తమ వార్డుల రిజర్వేషన్లపై ఒక అంచనాకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ ఇంకా వీడలేదు. ఈ ఉత్కంఠ ఓటర్ల తుది జాబితా విడుదల తర్వాత కూడా... అంటే రిజర్వేషన్ల ఖరారయ్యే వరకు కొనసాగనుంది. కాగా మున్సిపల్‌ వర్గాల నుంచి అనధికారికంగా జరిగే లీకేజీల ఆధారంగా ఆశావహులు, రాజకీయ నాయకులు వార్డుల రిజర్వేషన్లపై ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారు.

ఆదివారం కూడా పనిలోనే..
పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా రూపకల్పనతో పాటు అనేకానేక ప్రక్రియలు జరుగుతుండడంతో ఆదివారం కూడా జిల్లాలోని నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించారు. బోధన్‌ మున్సిపాలిటీలోనైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్‌ సిబ్బంది ఎన్నికలకు సంబంధించిన వివిధ ప్రక్రియల నిర్వహణలో తలమునకలయ్యారు.

164
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...