మున్సిపోల్స్‌కు చకచకా ఏర్పాట్లు


Wed,July 10, 2019 03:11 AM

ఇందూరు : పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతోంది. వార్డుల వారీగా ఫొటో ఓటరు జాబితా ముసాయిదా బుదవారం( నేడు) వెలువడనుంది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం అయ్యారు. వార్డుల వారీగా వీటిని ప్రచురించి ప్రజల నుంచి మూడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. వచ్చిన వాటిని ఒక రోజు వ్యవధిలో పరిష్కరించి మరునాడు తుది జాబితాను ప్రచురిస్తారు. ఓటరు జాబితా వెల్లడికి తేదీలను ఈ నెల 14కు కుదించగా.. శరవేగంగానే ఇందుకు తగ్గట్లుగానే పురపాలక సిబ్బంది పని చేశారు. మార్చిన తేదీల ప్రకారం 14వ తేదీ నాడు వార్డుల వారీగా ఓటరు తుది జాబితా వెల్లడిస్తారు. వార్డుల వారీగా ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయడంతో ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తవుతాయన్న సమాచారంతో రాజకీయ పార్టీల్లోనూ సందడి మొదలైంది. ఇటు అధికారులు ఆగమేఘాల మీద నివేదికలు సిద్ధం చేస్తూ ఎన్నికల కసరత్తులో పాలుపంచుకుంటున్నారు. జిల్లాలో నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూరు, బోధన్ మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి.

14న తుది జాబితా...
మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సిద్ధం అవ్వడంతో నేడు నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు మూడు మున్సిపాలిటీల్లో ఫొటో ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రదర్శించనున్నారు. 11వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్లు సమావేశం అవుతారు. 10, 11, 12 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఓటర్ల నుంచి వచ్చిన విన్నపాలు, అభ్యంతరాలను 13న పరిష్కరిస్తారు. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 14వ తేదీన ప్రకటిస్తారు. ఈసారి శాస్త్రీయ బద్ధంగా వార్డుల విభజన చేపట్టారు. అన్ని వార్డుల్లో ఓటర్లు సమానంగా ఉండేలా కనిష్ట, గరిష్ట పద్ధతిని ఎంచుకున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్యను ఆధారం చేసుకుని ఒక వార్డుకు ఎంత ఉండాలనే కోణంలో చర్యలు తీసుకున్నారు. 2011 జనాభా ప్రతిపాదికన (డివిజన్‌లు, వార్డులను) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల కోసం సర్వం సమాయత్తమవుతున్న తరుణంలో వార్డుల పెంపు ప్రక్రియ రాజకీయ వర్గాల్లో సంతోషాన్ని నింపింది. ఆశావహులు పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. పట్టణీకరణలో భాగంగా మున్సిపాలిటీలలో సమీప గ్రామాలను విలీనం చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలో సమీప గ్రామాలను విలీనం చేశారు. కొత్తగా భీమ్‌గల్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తొమ్మిది గ్రామాలను విలీనం చేశారు. ఇందులో బోర్గాం(పి), పాంగ్రా, గూపన్‌పల్లి, ముబారక్‌నగర్, బోర్గాం(కె), కాలూరు, ఖానాపూర్, సారంగాపూర్, మానిక్‌బండార్ గ్రామాలను విలీనం చేశారు. బోధన్ మున్సిపాలిటీలో అచన్‌పల్లి, శ్రీనివాస్‌నగర్, చెక్కి క్యాంపులను విలీనం చేశారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో పెర్కిట్, మామిడిపల్లి గ్రామాలను కలిపారు. ఎన్నికల షెడ్యుల్ రావడమే తరువాయి వడివడిగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానున్నది. షరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాని తర్వాత వస్తున్న ఈ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్ అన్ని స్థానాలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నది. దీంతో టీఆర్‌ఎస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరిగింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం డివిజన్లు, వార్డుల పెంపుపై ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వారికి రాజకీయపరంగా పోటీచేసే అవకాశాలు లభించినట్లయ్యింది.
జిల్లాలో మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెంచారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్‌తో పాటు నూతనంగా ఏర్పాటైన భీమ్‌గల్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరిగింది. 2011 జనాభా గణన ఆధారంగానే వార్డుల సంఖ్య పెంచారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 3,56,640 మంది, బోధన్ మున్సిపాలిటీలో 82,668 మంది, ఆర్మూర్ మున్సిపాలిటీలో 67,252 మంది, భీమ్‌గల్‌లో 14,860 జనాభా ఉంది. గతంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు, బోధన్ మున్సిపాలిటీలో 35, ఆర్మూర్ మున్సిపాలిటీలో 23, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 7 వార్డులు ఉన్నాయి. తాజా ఆదేశాల ప్రకారం వార్డుల సంఖ్య నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60కి, బోధన్ మున్సిపాలిటీలో 38కి, ఆర్మూర్ మున్సిపాలిటీలో 36కి, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 12కి వార్డుల సంఖ్య పెరిగింది.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...