వరుస నేరాలపై కామారెడ్డి ఎస్పీ విచారణ


Fri,July 5, 2019 04:12 AM

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం జరిగిన జ్యువెలరీ షాపుల దోపిడీ, మహిళ హత్య కేసు సంఘటనలపై కామారెడ్డి ఎస్పీ ఎన్.శ్వేతరెడ్డి ఆరాతీశారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆమె ముందుగా నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో వరుసగా జరిగిన మూడు జ్యువెల్లర్స్ షాపుల దోపిడీ ప్రాంతాలను పరిశీలించారు. దోపిడీకి పాల్పడిన దుండుగలు ఏ తరహాలో లూటీలు చేశారు, ఎంత మంది సభ్యులు వచ్చారనే అంశాల పై ఎస్పీ శ్వేతారెడ్డి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లూటీలు జరిగిన షాపులో అమర్చి ఉన్న సీసీ కెమెరాల రికార్డింగ్‌లను పరిశీలించారు. ఈ దోపిడీలకు పాల్పడింది మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ముఠాగా పోలీసులు నిర్ధారణకు రావడంతో అదే కోణంగా దర్యాప్తు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. వీలైనంత త్వరిత గతిన కేసును ఛేదించాలని చెప్పారు. జిల్లా పోలీస్ బృందాలను మహారాష్ట్రకు పంపించాల్సిందిగా అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డికి సూచించారు. అనంతరం నగరంలోని న్యాల్‌కల్ రోడ్డు ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన సాయమ్మ హత్య కేసుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళ హత్య జరిగిన ప్రదేశానికి సైతం వెళ్లి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య కేసులో జిల్లాకు చెందిన నేరస్తులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పాతనేరస్తులను కూడా విచారించమని రూరల్ నార్త్ సీఐ శ్రీనాథ్‌రెడ్డిని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఈ రెండు కేసుల్లో పురోగతి సాధించాల్సిందిగా ఎస్పీ శ్వేతారెడ్డి పోలీసు సిబ్బందికి సూచించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...