20 రోజుల్లోఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు


Thu,July 4, 2019 04:44 AM

- రివర్స్ పంపింగ్ పథకం ఇంజినీరింగ్ అద్భుతం
- ఈ పథకంతో బహుముఖ ప్రయోజనాలు
- రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: మరో ఇరవై రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునర్జీవ పథకం ద్వారా కాళేశ్వరం జలాలు అందుతాయని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద నిర్మిస్తున్న పునర్జీవ పథకం పంపుహౌస్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పునర్జీవ పథకంలో భాగంగా రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట్ వద్ద పంపుహౌస్‌ల్లో 0.6 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేలా మోటార్లు సిద్ధమవుతుననాయని, ఇరవై రోజుల్లోగా రివర్స్ పంపింగ్‌తో కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి చేరుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రివర్స్ పంపింగ్ పథకం ద్వారా 200 కి.మీ దూరంలోని కాళేశ్వరం జలాలు వెనక్కి ప్రవహిస్తూ వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి చేరే అద్భుత దృశ్యాన్ని చూడబోతున్నామన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని చూసేందుకు తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నారు. కేవలం రూ.1,080 కోట్లతో 60 టీఎంసీల నీటిని వినియోగించుకోగలిగే మరో కొత్త ప్రాజెక్టుగా రివర్స్ పంపింగ్ పథకాన్ని ఆయన అభివర్ణించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు సాగునీటిని అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోతూ, వట్టిపోతూ వస్తున్న విషయం తెలిసిందేనని అన్నారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వవైభవం తేవడానికి పునర్జీవ పథకాన్ని సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.

ఇదో అద్భుతం...
ఎవరూ కనీసం ఊహించని విధంగా నదిలో జలాలను వెనక్కి ప్రవహింపజేసే అద్భుతమైన పథకం రివర్స్ పంపింగ్ అన్నారు. ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడారు. రివర్స్ పంపింగ్ పథకంలో వరద కాలువ, కాకతీయ కాలువ 365 రోజులు నిండు జలాశయాలుగా మారుతాయని తెలిపారు. ఒక్కసారి ఎస్సారెస్పీని నింపుకోవడం ప్రారంభిస్తే నిజామాబాద్ జిల్లాలో రెండు పంటలకు సాగునీటి కొరత శాశ్వతంగా తీరుతుందన్నారు. కాళేశ్వరం -21వ ప్యాకేజీతో బాల్కొండ నియోజకవర్గంలో 72వేల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. ఇదే ప్యాకేజీ కింద ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో 1.60 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందనుందన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ- 22తో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్లలో సుమారు 2 లక్షల మేర భూములకు సాగునీరు అందనుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా స్థిరీకరించిన 1.30 లక్షల ఎకరాలకు, 2.70 లక్షల పాత ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు పుష్కలంగా అందనుందన్నారు.

మరికొన్ని రోజుల్లో కల సాకారం...
రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలు తరలివచ్చి ఎస్సారెస్పీకి చేరడాన్ని చూసేందుకు రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, ఇది మరికొన్ని రోజుల్లో సాకారం కానుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వట్టిపోయిన ఎస్సారెస్పీకి పూర్వవైభవం పోస్తూ పునర్జీవ పథకాన్ని అందించిన సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన మంత్రి ప్రశాంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రివర్స్ పంపింగ్ మూలంగా సాగునీటి ప్రయోజనాలే కాకుండా బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వరద కాలువ, తూ ముల ద్వారా చెరువులను నింపుకోగలుగుతామని తెలిపారు. ఈ సందర్భంగా ముప్కాల్ పంప్‌హౌస్ వద్ద ఉన్నతాధికారులతో పునర్జీవ పథకం పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వరద కాలువ నుంచి తూముల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం జగిత్యాల జిల్లా రాజేశ్వర్‌రావు పేట్ వద్ద గల రెండో పంప్‌హౌస్ పనుల పరిశీలనకు వెళ్తూ మార్గమధ్యలో మోర్తాడ్ మండలం దోన్కల్ వద్ద వరద కాలువలో చేపడుతున్న తూము నిర్మాణ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. వరద కాలువ నుంచి 8తూముల ద్వారా 19 చెరువులకు నీళ్లు అందించనున్నారు. రూ. 10 కోట్ల తో చేపట్టిన ఈ పనులు ప్రగతి గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పరిశీలన సందర్భం గా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. పథకం పనులు గడువులోగా పూర్తిచేసేలా వారికి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ రామ్మోహన్‌రావు, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ప్రాజెక్టు ఇన్‌చార్జి సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ సుధాకిరణ్, ఏజెన్సీ డీజీఎం డీవీ నారాయణ, డీఈ రాంప్రదీప్, ఏఈలు రూప్లానాయక్, ప్రవీణ్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు లకా్ష్మరెడ్డి, కోటపాటి నరసింహా నాయుడు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు సామ వెంకట్‌రెడ్డి, నాగంపేట్ శేఖర్‌రెడ్డి, దాసరి వెంకటేశ్, మిట్టాపల్లి మహిపాల్, లుక్క గంగాధర్, గుణ్వీర్‌రెడ్డి, రాజా పూర్ణానందం, కల్లెడ ఎలియా, ఎంపీపీలు అర్గుల రాధ, కల్గెడ చిన్నయ్య పాల్గొన్నారు.

రైతులకు వరప్రదాయిని...
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం రైతులకు వరప్రదాయినిగా నిలుస్తుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. లక్ష్మీపూర్ వద్ద వరద కాలువలో కాళేశ్వరం జలాలు పడే చోటు నుంచి ఎస్సారెస్పీ 30మీటర్ల ఎత్తులో ఉంటుందని, ఈ ఎత్తు దూరాన్ని 10 మీటర్ల ఎత్తు చొప్పున మూడు భాగాలుగా విభజించి పంపుహౌస్‌లు నిర్మించి ఎస్సారెస్పీకి నీటిని తరలించే గొప్ప ప్రాజెక్టు పునర్జీవ పథకమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అభివర్ణించారు. ఎస్సారెస్పీలోకి నీరు చేరడానికి మూడు పంపుహౌస్‌ల్లో 24మోటార్ల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాంపూర్‌లోని మొదటి పంపుహౌస్‌లో 5 మోటార్లు, రాజేశ్వర్‌రావుపేట్ వద్ద గల రెండో పంపుహౌస్‌లో నాలుగు మోటార్లు పనిచేస్తే ఈ వానాకాలమే కాళేశ్వరంలో అందుబాటులో ఉన్న జలాలను ఎస్సారెస్పీకి తరలిస్తామని తెలిపారు. ఈ తొమ్మిది మోటార్లు ఈనెల 15లోగా సిద్ధమవుతాయన్నారు. వీటితో 0.6 టీఎంసీ నీటిని ముప్కాల్ వద్ద గల మొదటి పంపుహౌస్‌తో సంబంధం లేకుండానే తరలించుకోవచ్చన్నారు. సెప్టెంబర్‌లోగా మొత్తం పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. సెప్టెంబరులో 20నుంచి 30 టీఎంసీలు ఎస్సారెస్పీకి తరలించుకునే అవకాశం ఉంటుందన్నారు. ముప్కాల్ వద్ద గల మూడో పంప్‌హౌస్ పనులు కూడా పూర్తికావచ్చాయని తెలిపారు. 20వ తేదీలోపు వచ్చే నీటిని ఎస్సారెస్పీలోకి చేరడానికి ముప్కాల్ వద్ద మూడో పంప్‌హౌస్‌లో గేట్ల బిగింపు పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ పనులు చకచకా పూర్తి చేస్తున్నారని తెలిపారు. అక్టోబర్‌లో ట్రయల్న్ నిర్వహించేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...