సాగులో బిజీ..బిజీ


Tue,June 25, 2019 02:50 AM

నిజామాబాద్ సిటీ: కర్షకుల కలల పంట కాలం ఖరీఫ్. కోటి ఆశలతో అన్నదాతలు మరోసారి పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల ప్రారంభంలోనే ఖరీఫ్ పనులకు అన్నదాత సిద్ధమవగా.. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో వర్షం కోసం ఎదురుచూశాడు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు దుక్కులుదున్ని వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మృగశిర కార్తె ప్రారంభంలోనే తొలకరి చినుకులు పడడంతో రైతులు సాగుకు అనుకూలంగా చేశారు. ఈ ఏడాదికి సంబంధించి జిల్లా వ్యవసాశాఖ అధికారులు సైతం ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచారు. రైతుబంధుకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో 2,35,749 మంది రైతులు ఉండగా.. ఈ సీజన్‌లో సుమారు విస్తీర్ణం 1.50 లక్షల హెక్టర్లలో పంటలు సాగు చేయనున్నారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు వరుణుడు కురుణించి భారీ వర్షాలు కురిస్తే పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

కాలం కలిసొచ్చేనా..
జిల్లాలో రెండు సంవత్సరాలుగా రైతులకు ఖరీఫ్ కలిసొచ్చింది. ఇప్పటికే రైతులు దుక్కులు దున్ని, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకొని సాగుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని వర్షం కోసం ఎదురుచూశారు. ఈ సంవత్సరం రాష్ర్టానికి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే రావాల్సి ఉన్నా ప్రస్తుత సీజన్‌లో ఇరవై రోజులు ఆలస్యమైంది. రెండు రోజుల క్రితమే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో జిల్లాలో మోస్తరు వర్షం కురవడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. మరో వర్షం కురిస్తే విత్తనాలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షంతో దుక్కిలోని వేడి పూర్తిగా వెళ్లిపోలేదు. మరో వర్షం పడితే భూమిలోని వేడి మొత్తం పొతుంది. తర్వాత విత్తనాలు నాటేందుకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఎదురుచూస్తున్నారు. ఆయా గ్రామాల్లోని రైతులు వరి పంటను సాగుచేయనున్నారు. దీనికి గాను వరినారు పోయడానికి ముందస్తుగా నారుమళ్లను తయారు చేస్తున్నారు.

మేలిమి విత్తనాలు, ఎరువులు..
జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాల కొరత లేకుండా పూర్తి ప్రణాళికతో అందుబాటులో ఉంచారు. ఈ సారి వరి 30వేల క్వింటాళ్లు, సోయా 30వేల క్వింటాళ్లు, జీలుగ 6వేల క్వింటాళ్లు, మొక్కజొన్న 500 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 15, కోటగిరి 13, భీమ్‌గల్ 24, బోధన్ 22, నిజామాబాద్ రూరల్ పరిధిలో 24 విత్తనాల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రైతులకు విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తున్నది. జీలుగ క్వింటాకు రైతులకు 65 శాతం, సోయాబీన్‌పై 40.65 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 60శాతం పైగా పంపిణీ పూర్తియిందని, త్వరలోనే పూర్తిస్థాయిలో విత్తనాలు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక ఎరువులు సైతం అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈసారి 9,44,410.838 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచారు. ఎరువులను సొసైటీ, ప్రైవేట్ డీలర్లు, మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు. రైతులందరూ విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయ అధికారులు విత్తనాల దుకాణాలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి రైతులు నష్టపోకుండా చూస్తున్నారు.

రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ..
జిల్లాలో రైతు బంధు పంపణీ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు చేపట్టిన రైతుల సమగ్ర సమాచార సేకరణ పూర్తి చేసి రైతుల వివరాలు సేకరించారు. గత సంవత్సరం కంటే ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతుల సంఖ్య పెరిగింది. ఈ సంవత్సరం నుంచి పెట్టుబడి సాయం ఎకరానికి రూ. 5వేలకు పెంచుతూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ సారి రైతులు, గ్రామాల సంఖ్య పెరగడంతో రైతు బంధు పథకం జిల్లా బడ్జెట్ కూడా పెరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుబంధు చెక్కులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం సుమారు రూ.258,81,74, 4745 బడ్జెట్ అవుతుంది. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు 2,08,918 రైతుల ఖాతాలను అప్‌డేట్ చేశారు. మిగితా 26,831 అప్‌డేట్ చేస్తున్నారు. 1,12,926 మంది రైతులకు రూ.107, 77,79705లను ఖాతాల్లో జమ చేశారు. మిగతా మొత్తం త్వరలోనే రైతులకు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

మట్టి పరీక్షల ఫలితాలు..
పొలంలో సారమెంత ఉంది? ఏ పోషకాలు ఎక్కువగా ఉన్నాయి? ఏం లోపం ఉందని గుర్తించేందుకు మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేశారు. లోపం ఉంటే ఆ సమాచారాన్ని రైతుల వారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మట్టి నమూనాల సేకరణ కార్యక్రమం అన్ని మండల కేంద్రంలో నిర్వహించారు. ప్రస్తుతం సేకరించిన నమూనాల ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల ఆధారంగా గ్రామం నుంచి ఒక రైతును ఎంపిక చేసుకొని భూమికి కావాల్సిన ఎరువుల వాడకం, సాగు చేయాల్సిన పంటలు తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పిస్తారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...