అవగాహన లేకే కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు


Tue,June 25, 2019 02:49 AM

శక్కర్‌నగర్: నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ లిక్విడేషన్ విషయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అవగాహన లేకనే సీఎం కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారు, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. బోధన్ పట్టణంలో పార్టీ సీనియర్ నాయకుడు పూదోట రవికిరణ్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ, నాయకుడు గిర్దావర్ గంగారెడ్డి, మండల రైతు సమన్వయకర్త బుద్దె రాజేశ్వర్, చెరుకు రైతు జిల్లా అధ్యక్షుడు కేపీ. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. లిక్విడేషన్ విషయంలో అవగాహన లేని ఎంపీ కేసీఆర్ కుటుంబాన్ని తప్పుబట్టడం సరైంది కాదని అన్నారు. టీడీపీ పాలనలోనే ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, విక్రయాలు కొనసాగాయని గుర్తు చేశారు.అనంతరం కాంగ్రెస్ హయాంలో పూర్తిగా ప్రైవేట్ పరం చేయగా సదరు యజమాని బీజేపీకి చెందిన ఎంపీ కాగా ఫ్యాక్టరీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు పొందాడని, అప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు డి. శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి ఏంచేశారని ప్రశ్నించారు. రైతుల భాగస్వామ్యంతో కొనసాగించేందుకు ఫ్యాక్టరీని పునరుద్ధరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఫ్యాక్టరీని అర్ధంతరంగా మూసివేయడంతో కార్మికులకు గతంలో ఏ ప్రభుత్వాలు చెల్లించని విధంగా అప్పటి ఎంపీ కవిత కృషితో ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 60 కోట్ల బకాయిలు చెల్లించిందన్నారు. ఈ విషయాలు తెలియని ఎంపీ అర్వింద్ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులు తమ గోడు చెప్పుకునేందుకు సమయం ఇవ్వకపోవడం అర్వింద్ మీ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. ఫ్యాక్టరీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉందని, కార్మికులకు ఎంపీ ఎలాంటి న్యాయం చేస్తారో తేల్చాలని అన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకుడు పి.రవికిరణ్, సాలూరా మాజీ సర్పంచ్ రాజేశ్వర్ పటేల్ ఉన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...