జోరందుకున్న వర్షాలు


Tue,June 25, 2019 02:48 AM

నిజామాబాద్ సిటీ/ నిజామాబాద్ రూరల్/నవీపేట/ధర్పల్లి/ఆర్మూర్ రూరల్/మాక్లూర్/భీమ్‌గల్/శక్కర్‌నగర్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రంలో కంటే మండల కేంద్రంలోని గ్రామా ల్లో మోస్తారు వర్షం కురిసింది. మూడు నెలలు ఎండ తీవ్రతతో తట్టుకోలేకపోయిన ప్రజలు కురుస్తున్న వర్షాలకు ఉపశమనం పొందుతున్నారు. శుక్రవారం నుంచి వాతావరణం చల్లగా మారడంతో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. ఆదివారం సా యంత్రం జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. రానున్న రో జుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని గౌతంనగర్‌లో ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కమ్మర్‌పల్లి మం డలం ఏర్గట్లలో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండురూ గ్రామంలోని పూలంగ్ వాగు పొంగిపొర్లింది. సోమవారం ధర్పల్లిలో జోరుగా కురిసిన వర్షానికి రోడ్లపై వరదనీరు వచ్చి చేరింది. జిల్లాలో ఆదివారం రాత్రి 18.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఆర్మూర్ మండలంలో 59.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా రుద్రూర్ మండలంలో 1.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏర్గట్ల 5.0, నిజామాబాద్ రూరల్ 19.5, మోర్తాడ్ 3.0, నందిపేట్ 18.1, కోటగిరి 22.8, వేల్పూర్ 1.9, వర్ని 8.3, నిజామాబాద్ నార్త్ 35.2, రెంజల్ 7.9, బోధన్ 24.2, చందూర్ 22.0, మెండోరా 39.5, నిజామాబాద్ సౌత్ 35.2, మాక్లూర్ 51.5, జక్రాన్‌పల్లి 55.5, బాల్కొండ 28.1, ఎడపల్లి 58.2, నవీపేట్ 21.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ముప్కాల్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మోస్రా, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, సిరికొండ మండలాల్లో వర్షం కురియలేదు. రూరల్ మండలంలోని ఆకుల కొండూర్, పాల్దా, తిర్మన్‌పల్లి, గుండారం, కాలూర్, ఖానాపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో ఆ గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆకుల కొండూర్ గ్రామ శివారులోని పల్ చెరువులోకి పెద్దమొత్తంలో నీరు చేరడంతో జల కళను సంతరించుకుంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వరద ద్వారా వచ్చిన వర్షపు నీటితో ఆ గ్రామ చెరువు జల కళను సంతరించుకుందని గ్రామ సర్పంచ్ అశోక్ తెలిపారు.

నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ వాగు, ముబారక్‌నగర్, కొండూర్, పాల్దా గ్రామ శివార్ల గుండా ప్రవహిస్తుంది. ఆదివారం కురిసిన వర్షంతో ఈ వాగు కూడా నీటితో ప్రవహిస్తుంది. గుండారం, ఖానాపూర్, కాలూర్, పాల్దా, తిర్మన్‌పల్లి గ్రామాల చెరువులకు కూడా నీరు వచ్చి చేరింది. నవీపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి జోరువాన కురిసింది. ఆదివారం కురిసిన వర్షానికి ఎలాంటి నష్టం జరుగలేదని తహసీల్దార్ మోతీసింగ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో సోమవారం కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. సుమారు గంట సేపు కురిసిన వర్షానికి వాహనాల రాక పోకలు తీవ్ర ఇబ్బందులు వాటిల్లాయి. పట్టణంలోని కాలనీలలో నీరు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. భీమ్‌గల్ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. వర్షం కురవడంతో మొక్కజొన్న, పసుపు, సోయా తదితర పంటలను వేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. ఏర్గట్ల మండలంలో ఆదివారం రాత్రి 11 గంటలకు భారీ వర్షం కురిసింది. బోధన్ డివిజన్‌లో సోమవారం ఉదయం వరకు వర్షం కురిసింది. బోధన్ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. రాకాసీపేట్ రైల్వేగేట్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రహదారి మొత్తం వర్షం నీటితో నిండిపోయింది. పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో సైతం గుంతలు ఏర్పడ్డాయి.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...