ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో రెండో డ్రైరన్ విజయవంతం


Sun,June 23, 2019 02:34 AM

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : ఎస్సారెస్పీకి ఈ వానకాలం సీజన్‌లోనే కాళేశ్వరం నీటిని అందించే లక్ష్యంతో పునర్జీవ పథకం పనులు కొనసాగుతున్నాయి. జిల్లాను సస్యశ్యామలం చేసే పునర్జీవ పథకంలో మోటార్లను సిద్ధం చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పథకంలో భాగంగా వరద కాలువ 73వ కిలోమీటరు వద్ద రాంపూర్ సమీపంలో నిర్మించిన మొదటి పంపు హౌస్‌లోని రెండో యూనిట్‌లో శనివారం ఉదయం నిర్వహించిన డ్రైరన్ టెస్టు విజయవంతమైంది. ఇదే పంపుహౌస్‌లో మే 31న మొదటి యూనిట్‌కు డ్రైరన్ టెస్టు నిర్వహించగా.. అది విజయవంతమైన విషయం తెలిసిందే.

సీఎం ఆదేశాలతో వేగవంతం...
ఈనెల 4న సీఎం కేసీఆర్ రాంపూర్‌లోని మొదటి పంపుహౌస్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.ఈ సీజన్‌లో వానలు ప్రారంభం కాగానే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపు హౌస్ నుంచి వరద కాలువకు నీటిని తరలించుకునే అవకాశం ఉంటుందని, ఈ మేరకు ముందుగా మొదటి పంపుహౌస్‌లో ఐదు మోటార్లను జూలై నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే.దీంతో అధికారులు వడివడిగా పనులు పూర్తిచేస్తూ రెండో మోటారును సిద్ధం చేసి శనివారం డ్రై రన్ నిర్వహించారు.రాష్ట్ర ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి పర్యవేక్షణలో డ్రైరన్ నిర్వహించారు. డ్రై రన్ అనంతరం పంపుహౌస్‌ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు.అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

నెలాఖరు నాటికి 3వ పంపు యూనిట్ డ్రైరన్...
ఈ పంపుహౌస్‌లో ఈ నెలాఖరు నాటికి 3వ పంపు యూనిట్ డ్రైరన్, జూలై చివరి నాటికి 4వ, 5వ యూనిట్లలో డ్రైరన్ పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని వరద కాలువ ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు తెలిపారు. 34వ కిలోమీటరు వద్ద 2వ పంపుహౌస్‌లో మొదటి మోటారు సిద్ధమైందని, రెండో మోటారు పనులు జరుగుతున్నాయని తెలిపారు. రెండో పంపుహౌస్ వద్ద వారం రోజుల్లో విద్యుత్ సబ్ స్టేషన్ చార్జి పూర్తి కాగానే రెండు మోటార్ల డ్రైరన్ టెస్టు నిర్వహించేలా కృషి జరుగుతోందన్నారు. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరుసటి రోజైన శనివారమే పునర్జీవ పథకం రెండో యూనిట్ డ్రైరన్ విజయవంతంగా నిర్వహించడంతో జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

సంబురాలు చేసుకున్న ఇంజినీర్లు, సిబ్బంది...
డ్రైరన్ టెస్టు విజయవంతం కావడంతో ఇంజనీర్లు, సిబ్బంది, అధికారులు సంబురాలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ సుధాకిరణ్, డీఈఈ రామ్ ప్రదీప్, ఏఈఈలు తిరుపతి, మధు, నవయుగ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్ వెంకట రామారావు, డీజీఎం నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...