యోగాతో మానసిక ప్రశాంతత


Sat,June 22, 2019 02:52 AM

నిజామాబాద్ సిటీ: యోగాను దిన చర్యలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అలవడుతుందని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని బోర్గాం (పి) వద్ద గల ఎస్వీఎల్ కల్యాణ వేదికలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఆయుష్ శాఖ, నెహ్రూ యువజన కేంద్రం, ఫీల్డ్ ఔట్ రీచ్ బ్యూరో, జిల్లా యోగా అసోసియేషన్ , ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, తదితర శాఖలు, సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా గురువులు రాంచందర్, సిద్దిరాములు, యోగాసనాలు వేయించారు. పలు రుగ్మతలను నయం చేయడానికి, వ్యాధుల నుంచి బయట పడడానికి, మానసిక ప్రశాంతతకు, వారు యోగా ఆసనాలు చేసి చూపించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా మన సంస్కృతిలో భాగమని, పురాతన కాలం నుంచి దీనిని ఆచరించడం ద్వారా ఎందరో వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకున్నారని తెలిపారు. యోగాతో క్రమశిక్షణ అలవడుతుందని, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. ఎన్నో రుగ్మతలకు యోగ ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయని, ఎందరో ప్రత్యక్షంగా అనుభవించిన వారు తెలుపుతున్నారన్నారు. యోగాను అన్ని వయసుల వారు ఆచరించవచ్చని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర రాష్ట్ర సంచాలకుడు ప్రభీర్‌కుమార్ ప్రధాన్, కేంద్ర సమాచార ప్రసారశాఖ ఫీల్డ్ ఔట్‌రీచ్ బ్యూరో సహాయ సంచాలకుడు హరిబాబు, ఆయుష్ శాఖ అధికారులు డాక్టర్ రమణ మోహన్, తిరుపతి, డాక్టర్ గంగాదాసు, ఏడో బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య, నెహ్రూ యువకేంద్ర అధికారి రాంచందర్, జిల్లా క్రీడల అధికారి కృష్ణారావు, ఐఆర్‌సీఎస్ ప్రతినిధులు డాక్టర్ రాంచందర్, రాజశేఖర్, బస్వా లక్ష్మీనర్సయ్య, పల్లె గంగారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఏడో బెటాలియన్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...