కోటి ఎకరాలకు నీరివ్వడమే లక్ష్యం


Sat,June 22, 2019 02:52 AM

ఇందూరు: తెలంగాణలోని కోటి ఎకరాల మాగాణికి నీళ్లందంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కలెక్టరేట్ ఆవరణలో టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు తీశారు. మెప్మా సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ధర్నాచౌక్‌లో ముగ్గులు వేశారు. అనంతరం బిగాల గణేశ్ గుప్తా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు చెప్పారు. పటాకులు కాల్చి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా గణేశ్ గుప్తా మాట్లాడుతూ..తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం బహుళార్ధ సాధక ఎత్తిపోతల పథకం అతితక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసుకోసుకుని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు.

తెలంగాణలో కళ తప్పిన ప్రాజెక్టులకు కాళేశ్వరం ప్రాజెక్టుతో పునర్వైభం రానుందన్నారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన నీటి ప్రాజెక్టులకు , టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం జరిగిందని, ఉద్యమ ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని కోటి ఎకరాల మాగాణి సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో ఆకుంఠిత దీక్షతో ప్రాజెక్టులు చేపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రతి ఎకరానికి నీరు అందించడమే లక్ష్యంగా మూడేండ్ల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు, శుక్రవారం ప్రారంభించుకున్నామన్నారు. ప్రపంచంలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఒక అద్భుతమన్నారు. సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడి, రాత్రింబవళ్లు ఇంజినీర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహంచారన్నారు. స్వయంగా సీఎం కేసీఆరే అనేక మార్లు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు సందర్శించి ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యేలా చొరవ చూపారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఏఎస్ పోశెట్టి, టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, నీటి పారుదల సిబ్బంది పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...