కేసీఆర్ సంకల్ప ఫలమే కాళేశ్వరం ప్రాజెక్టు


Fri,June 21, 2019 02:00 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో ఇందూరు జిల్లాను శాశ్వత జలసిరుల నిలయంగా మార్చే కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం (నేడు) సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కాళేశ్వరం జలాలు త్వరలో జిల్లాకు అందనున్న నేపథ్యంలో జిల్లాలో సర్వత్రా సంబురం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన మేధోమథనంలో కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా పాలు పంచుకుంటూ, జిల్లాను సస్యశ్యామలం చేయనున్న పునర్జీవ పథకంపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి కృషి సైతం ఎంతో ఉంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాభివందనాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్సీ పునర్జీవ పథకం, సీఎం కేసీఆర్ కృషిపై నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడారు.

నమస్తే: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనుభూతి ఎలా ఉంది..?
మంత్రి : తెలంగాణ నిండా సాగునీటి పండుగంత ఆనందంగా ఉంది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలన్న కేసీఆర్ ధృడ సంకల్ప ఫలితమే నేటి కాళేశ్వరం ప్రాజెక్టు. పోరాడి సాధించిన తెలంగాణను బంగారుమయం చేయడానికి తెలంగాణలో నదీ జలాల్లో మన వాటా హక్కును వినియోగించుకోవడం ఆవశ్యకమని భావించారు సీఎం కేసీఆర్. ఇందు కోసం పగలు, రాత్రుల్లు తాను మేధోమథనం చేశారు. ఆ ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు.

సీఎంకు సన్నిహితుడిగా ఆయనలో కాళేశ్వరం తపనను ఎలా చూస్తారు?
తెలంగాణను దేశంలో నంబర్‌వన్‌గా నిలపాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అతి కీలకమైన సాగునీటి సమస్యను లేకుండా చేయాలనేది ఆయన మదిలో నిరంతర మథనం చూశాను. కాళేశ్వరం ప్రాజెక్టును ముందుకు పడేలా చేసేందుకు మహారాష్ట్రతో ఒప్పందాన్ని సాధించడం, ప్రాజెక్టు పనులను నిరంతరం సమీక్షించడం దగ్గరుండి చూశాను. తెలంగాణే ఆశగా, తెలంగాణను బాగు చేయడమే శ్వాసగా ఆయన పని చేస్తున్నప్పుడు అపర భగీరథుడిని ఆయనలో చూశాను.

జిల్లాకు పునర్జీవం పోయడం పై మీ అభిప్రాయం?
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన వరం. గోదావరి నదిలో ఎస్సారెస్పీ ఎగువన వ్యథ.. దిగువన వందలాది టీఎంసీల నీటి వృథా జరుగుతున్నది. ఈ ఫలితంగా జిల్లాలో, ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు కన్నీటి సాగే మిగులుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎస్సారెస్పీకి పునర్జీవం పోసే నిర్ణయం సీఎంకేసీఆర్ తీసుకున్నారు. ఫలితంగా జిల్లాలో 21-ప్యాకేజీ కింద, ఎస్సారెస్పీ వరద కాలువ, కాకతీయ కాలువ కింద 2లక్షల పైచిలుకు ఎకరాలకు రెండు పంటలకు సాగు నీరు అందనుంది. అనేక ఎత్తిపోతల పథకాలు రెండు పంటలకు నీళ్లు అందిస్తాయి. కాకతీయ కాలువ కింద లీకేజీ రైతుల సమస్య శాశ్వతంగా తీరిపోతుంది.

పునర్జీవ పథకం పనులు ఎలా జరుగుతున్నాయి?
ఈ వానకాలంలోనే ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాలు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. పునర్జీవ పథకం పనులను సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మొదటి పంపుహౌస్‌లో ఐదు మోటార్లను జూలై నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ వర్షాకాలం ఆరంభ వర్షంతో కాళేశ్వరం ప్రాజెక్టులోకి వచ్చే జలాలను వినియోగించుకోవడం, ప్రారంభించాలనేది లక్షం. కావున ముందుగా అర టీఎంసీ చొప్పున తరలించేలా పునర్జీవ పథకం పంపుహౌస్‌లు సిద్ధమవుతున్నాయి.

జిల్లాకు వ్యవసాయపరంగానే కాకుండా ఇతర ప్రయోజనాలు ఎలా ఉంటాయి?
మనది వ్యవసాయాధారిత జిల్లా. దశాబ్దన్నర కాలంగా ఎస్సారెస్పీ వెలవెల బోతుండడం, నిజాంసాగర్ ఎండిపోవడమే ఎక్కవగా చూస్తున్నాం. ఇది జిల్లా వ్యవసాయాన్ని నీరు గార్చింది. ఫలితంగా వ్యవసాయాధారిత గ్రామాల రైతులు, కూలీలు గల్ఫ్ బాట పడ్డారు. ఇదంతా ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు వట్టి పోవడంతో జరిగింది. వ్యవసాయం బాగుంటే పరోక్ష ఉపాధి బాగుంటుంది. ఎస్సారెస్పీని పునర్జీవ పథకంతో కాళేశ్వరం జలాలతో నింపడంతో ముందుగా జిల్లాలో వ్యవసాయ రంగానికి పూర్వవైభవం వస్తుంది. యువత గల్ఫ్ బాట పట్టడం తగిపోతుంది. జిల్లాలో పంటల ఉత్పత్తి, దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. తద్వారా జిల్లాలో మహిళా సంఘాలు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించనున్నాయి.

మీ నాన్న సురేందర్‌రెడ్డి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఎంతో ఆనందపడే వారు కదా?
నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభిస్తుండడం చూసి పులకించిపోయేవారు. మా నాన్న గారిది రైతు దృక్పథం. ఆయన రాజకీయ పయనమంతా రైతును అల్లుకొనే సాగింది. కేసీఆర్‌కు సన్నిహితుడిగా కేసీఆర్ తెలంగాణకు సాగునీటి కోసం ఎంతగా పరితపించేవారో నాన్నకు బాగా తెలుసు. కేసీఆర్ ఇలాంటి విజయాలు సాధిస్తుంటే చూడడం ఆయనకు ఎంతో ఇష్టంగా ఉండేది.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...