ఆబ్కారీకి అవినీతి మత్తు


Fri,June 21, 2019 01:57 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో ఎక్సైజ్ అధికారుల వసూళ్ల దందా జోరుగా సాగుతోంది. వైన్స్‌షాపుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ నాకింత.. నీకింత అని ఒక స్థా యి అధికారులు పంచుకుంటున్నారు. వైన్స్‌షాప్‌లు, బార్ల నుంచి నెలవారీ మామూళ్లు నడుస్తున్నాయి. ఇంకా లోతుగా అయితే మామూళ్లు నెలవారి అందిస్తున్న లిక్కర్ యజమానులు ఉదయం పూటే బార్ల తెరిచి మద్యం విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్డు షాప్‌ల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. ఇలా నిత్యం జరుగుతున్నా.. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణ లోపం స్పష్టం గా కనబడుతోంది. గతేడాది జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్‌పై ఏసీబీ కేసు నమోదు కావడంతో ఒక్కసారి అధికారులు ఖంగుతిన్నారు. ఇది జరిగి సుమారు రెండేండ్లు గడుస్తున్నా తాజాగా బుధవారం మరోసారి బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ దాడిచేసి సీఐ, ఎస్సైపై కేసు నమోదు చేయడంపై ఎక్సైజ్‌శాఖ అధికారుల అంతులేని అవినీతి మరోసారి బయటపడింది.

ఉన్నతాధికారి నిర్లక్ష్య ధోరణి...
జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కొందరు అధికారుల వేధింపులు భరించలేక డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో ఏసీబీని ఆశ్రయిస్తున్నారని సమాచారం. డిప్యూటీ కమిషనర్ జిల్లాకు వచ్చినప్పుడు నామమాత్రంగా సీఐ, ఎస్సైలతో సమీక్ష నిర్వహించి వెళ్లిపోవడంతో అధికారుల అవినీతి రోజురోజుకు ఎక్కువ అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. 2016 జనవరి 25న అర్ధ్ధరాత్రి జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ స్టేషన్ కార్యాలయంలోనే కానిస్టేబుల్, సిబ్బంది మందు సేవిస్తూ పేకాట ఆడిన విషయం డిప్యూటీ కమిషనర్ దృష్టికి వెళ్లిన చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వదిలేశారు. అలాగే అదే సంవత్సరంలో వైన్స్ యజమానులు సిండికేట్‌గా ఏర్పడి మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నా విషయం పై ఫిర్యాదులు వెళ్లినా చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రజాసంఘాలు వినియోగదారుల సమాచార కేంద్రంలో ఫిర్యాదు చేశా రు. దీంతో వైన్స్ యాజమాన్యాలు తిరిగి ఎంఆర్‌పీకే మద్యం విక్రయించారు. ఇలా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందించక పోవడం, అధికారులపై నిఘా లేకపోవడంతోనే డిప్యూటీ కమిషనర్ నిర్లక్ష్య ధోరణి ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అంతులేని అవినీతి
జిల్లా అధికారి నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారు. బార్లు, వైన్స్, బెల్టుషాప్‌ల నుంచి ప్రతినెలా మామూళ్లను వసూలు చేస్తున్నారు. దీంతో మద్యం షాప్‌ల తనిఖీల మాటే ఎత్తడం లేదు. కల్తీ మద్యాన్ని అరికట్టడం, సమయపాలన పాటించేలా చూడాల్సిన ఉన్నప్పటికీ, ఆ వైపు దృష్టి సారించడం లేదు. అయితే జిల్లాలో ఓ ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయంలో సీఐ మాత్రమే మామూళ్లు పుచ్చుకుంటున్నారని, తానే స్వయంగా వైన్స్ యజమానులకు ఫోన్ చేసి తనకే నెలవారీ డబ్బులు ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో, స్టేషన్ కానిస్టేబుళ్లకు మామూళ్లు రాకపోవడంతో సీఐపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

పొద్దుపొద్దునే బార్లలో మందు విక్రయం...
జిల్లాలో రెండేండ్లుగా కొత్త సంప్రదాయం మొదలైంది. ఉదయం 8గంటల నుంచే బార్లలో మద్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాతే బార్లు, వైన్స్‌లు తెరవాలి. కానీ, ఉదయం 8గంటల నుంచే కూలీలు, మద్యం ప్రియులు బార్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 8గంటలకు బార్లు తెరిచి చీప్ లిక్కర్‌ను విక్రయిస్తున్నారు. వైన్స్ దుకాణాల్లో పర్మిట్ రూమ్‌కు అనుమతి ఇవ్వడంతో బార్ల వ్యాపారం తగ్గిపోయింది. ఈ విషయమై కొందరు బార్ల యజమానులు ఎైక్సైజ్ ఉన్నతాధికారి వద్ద మొరపెట్టుకున్నట్లు తెలిసింది.

బెల్టు షాప్‌లకు నేరుగా సరఫరా...
జిల్లా కేంద్రంలో వైన్స్ యజమానులు నేరుగా తమ వాహనాల్లో బెల్టు షాప్‌లకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా యజమానులు మాత్రం మద్యం రవాణా చేస్తున్నారు. ఒకప్పుడు బెల్టు షాప్ నిర్వాహకులు వైన్స్ దుకాణాలకు వచ్చి మద్యాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ, ఈ సంవత్సరం కొత్తగా వైన్స్ యజమానులు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి రెండు, మూడు రోజుల ఒకసారి మద్యం సరఫరా చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాకు ఎక్సైజ్ అధికారులు సహకారం ఎంత ఉందో తెలుస్తున్నది.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...