గురుకులాలతో కార్పొరేట్ తరహా విద్య


Mon,June 17, 2019 03:10 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిరుపేదలకు కార్పొరేట్ తరహా విద్య అందుతున్నది. కేజీ టూ పీజీ ఉచిత నాణ్యమైన విద్యనందించేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ మేరకు వడివడిగా అడుగులు వేస్తున్నది. గురుకుల పాఠశాలలను విస్తృతం చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో ఆరు గురుకుల పాఠశాలలతో పాటు ఒక జూనియర్ కాలేజ్ కొనసాగుతున్నది. కొత్తగా ప్రతి నియోజకవర్గానికి ఒక మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు సోమవారం (నేడు) జిల్లాలో కొత్తగా ఆరు గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నారు. దీనికోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాల్కొండ మండలంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురుకుల పాఠశాలను ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిజిటల్ క్లాసులతో విద్యాబోధన, నాణ్యమైన విద్యతో పాటు భోజన సౌకర్యం, యోగా, వ్యాయామం, ఆసక్తిగల విద్యార్థులకు చిత్రలేఖనం తదితర అంశాల్లో శిక్షణ, సౌకర్యాలతో కార్పొరేట్ తరహా హంగులతో ఈ గురుకులాల్లో పేద విద్యార్థులకు విద్య దరిచేరనున్నది.

ఇప్పటికే జిల్లాలో 1,963 మంది విద్యార్థులు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఆరు గురుకులాల ద్వారా మరో 1,440 మంది విద్యార్థులకు ఈ విద్యాబోధన దరి చేరనున్నది. ఒక్కో గురుకులంలో 250 మంది విద్యార్థులు ఐదు, ఆరు, ఏడు తరగతుల కోసం అడ్మిషన్ల ద్వారా ప్రవేశం కల్పిస్తారు. కాగా, రెండు నెలల క్రితం ఈ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. సోమవారం (నేడు) ప్రజాప్రతినిధులు ప్రారంభించడమే తరువాయి.. తరగతులు షురూ కానున్నాయి. ఐదో తరగతిలో 80మంది విద్యార్థులు, ఆరో తరగతిలో 80 మంది విద్యార్థులు, ఏడో తరగతిలో మరో 80మంది విద్యార్థుల చొప్పున మొత్తం 240 మంది విద్యార్థులకు ఒక్కో గురుకులం ద్వారా నాణ్యమైన విద్య అందనున్నది. ఈ మేరకు కావాల్సిన ఉపాధ్యాయ సిబ్బందిని కూడా నియమించారు. ఒక్కో గురుకులంలో ఏడుగురు ఉపాధ్యాయులు విద్యా బోధన చేయనున్నారు. ఆన్‌లైన్ ద్వారా ప్రవేశం కల్పించిన అడ్మిషన్లలో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నది. బీసీలకు 75శాతం, ఇందులో ఏ, బీ, సీ, డీ, ఈ వర్గాలకు విడివిడిగా కేటాయింపులు చేశారు. బీసీ (ఏ) గ్రూప్ విద్యార్థులకు 18శాతం రిజర్వేషన్ ఇస్తుండగా.. బీసీ-బీ గ్రూపునకు 26శాతం, బీసీ-సీ గ్రూపునకు 3శాతం, బీసీ-డీ గ్రూపునకు 18శాతం, బీసీ-ఈ గ్రూపునకు 10శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 5 శాతం, ఓబీసీలకు 2 శాతం, అనాథలకు 3శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించారు.

కొత్తగా ఏర్పడే గురుకులాలు ఇవే...
జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఆరు గురుకులాలను ఏర్పాటు చేస్తున్నది. నేటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 2గంటలకు గురుకులాన్ని ప్రారంభిస్తారు. బోధన్‌లో బాలికల గురుకులాన్ని ఎమ్మెల్యే షకీల్ ప్రారంభించనుండగా, ఆర్మూర్‌లో బాలికల గురుకులాన్ని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రారంభిస్తారు. డిచ్‌పల్లి మండలం రాంపూర్, ధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న రెండు బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభిస్తారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలంలో బాలికల గురుకుల పాఠశాలను ఈనెల 22న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. పాతవి ఇప్పటికే ఆరు గురుకుల పాఠశాలలతో పాటు ఒక జూనియర్ కాలేజ్ ఉండగా.. తాజాగా ప్రారంభం కానున్న ఆరు గురుకులాలతో కలిపి మొత్తం 13 గురుకులాల్లో మొత్తం 3,403 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనున్నది. పాత గురుకులాలు మోర్తాడ్‌లో బాలుర పాఠశాల ఒకటి ఉండగా, నందిపేట్ మండలం నూత్‌పల్లిలో బాలుర గురుకుల పాఠశాల ఉండగా, ఎడపల్లి మండల కేంద్రంలో బాలుర గురుకులం, సిరికొండ మండలం చీమన్‌పల్లిలో బాలికల గురుకులం, నిజామాబాద్ అర్బన్ పరిధిలోని దాస్‌నగర్‌లో బాలికల పాఠశాల కొనసాగుతున్నది. వీటితో పాటు అర్బన్‌లో పస్టియర్, సెకండియర్ బాలుర కోసం జూనియర్ కాలేజ్ కొనసాగుతున్నది. కంజరలో పదో తరగతి వరకు పాత గురుకులం ఒకటి కొనసాగుతున్నది. ఉన్న గురుకులాలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు వాటిని బలోపేతం చేస్తూ మరిన్ని కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నాణ్యమైన ఉచిత విద్యాబోధన కోసం విశేషంగా కృషి చేస్తున్నది. కేజీ టూ పీజీ ఉచిత విద్యా బోధనలో భాగంగా నిరుపేదలకు కార్పొరేట్ తరహా నాణ్యమైన విద్యను అందిస్తున్నది. కొత్తగా ఏర్పాటయ్యే గురుకులాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని రీజనల్ కోఆర్డినేటర్ తిరుపతి తెలిపారు. డిజిటల్ క్లాసులతో నాణ్యమైన విద్యాబోధన, ఉచిత భోజన, వసతి సౌకర్యం, యోగా, వ్యాయామం, లైబ్రరీ తదితర అన్ని సౌకర్యాలను కల్పిస్తూ విద్యార్థుల ప్రతిభను బట్టి ఆయా రంగాల్లో మరింత నైపుణ్యం సాధించేలా ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు.

కేజీ టూ పీజీ విద్యలో భాగంగా రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసింది. వెనుకబడిన బీసీ కులాలకు చెందిన వారికి బాసటగా నిలిచేందుకు గాను కొత్త గురుకులాలను జిల్లాకు మంజూరు చేసింది. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నాణ్యమైన విద్య, భోజన వసతితో పాటు ఇతర సామగ్రిని పంపిణీ చేస్తోంది. విద్యార్థులలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. విద్యార్థులకు పౌష్ఠికాహారాన్ని కల్పిస్తున్నది. ఆంగ్ల మాధ్యమ ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం ఇంగ్ల్లిష్ మీడియంలో విద్యా బోధన సదుపాయం కల్పిస్తోంది. గురుకులాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు పంపిణీ చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు ఆటపాటలు, అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ద్వారా వారు భవిష్యత్తులో వివిధ రంగాల్లో రాణించేందుకు తోడ్పాటు అందిస్తోంది. విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి విద్యార్థికి మూడు జతల దుస్తులు, ట్రాక్, సూట్ సరఫరా చేస్తోంది. కంప్యూటర్ యుగంలో విద్యార్థులకు అవరసమైన నాణ్యమైన విద్య అందించేందుకు గాను కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రతి విద్యార్థికి బెడ్డింగ్ మెటీరియల్ సరఫరా చేస్తోంది. విద్యతో పాటు ఆటలు, వారి ఆసక్తిని బట్టి వివిధ అంశాలల్లో శిక్షణ ఇస్తోంది.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...