బాలికలకు ఆరోగ్య రక్ష..!


Sun,June 16, 2019 03:02 AM

కోటగిరి : జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ కళాశాలల్లోని బాలికలకు హెల్త్‌ హైజెన్‌ కిట్లు పంపిణీని అధికారులు ప్రారంభించారు. జిల్లాలోని 120 ప్రాథమికోన్నత పాఠశాలలు, 25 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చదువుతున్న 31,163 మంది బాలికలకు అవసరమైన ఆరోగ్య కిట్లను అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం మండల విద్యా వనరుల కేంద్రాల్లో సిద్ధ్దంగా ఉన్నాయి. ఇప్పటికే పలు పాఠశాలల్లో కిట్లు పంపిణీ చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బాలికలకు ఆరోగ్య కిట్లు ప్రభుత్వం సరఫరా చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న బాలికల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. విద్యార్థులకు హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. జూన్‌లో ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో బాలికలకు ఆరోగ్య కిట్లు అందజేస్తున్నది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థినులకు వీటిని పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, బాలికల గురుకుల పాఠశాలలకు హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్స్‌ పంపిణీ చేస్తున్నారు. ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా హెల్త్‌ కిట్స్‌ అందజేయనున్నారు.

కిట్‌లో 14 రకాల వస్తువులు..
ప్రభుత్వ విద్యాసంస్థలో కిశోర బాలికలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న హెల్త్‌ అండ్‌ హైజిన్‌ కిట్‌లో 14 రకాల వస్తువులు ఉంటాయి. వీటిలో పతంజలి కంపెనీకి చెందిన 3 స్నానపు సబ్బులు, 3 డిటర్జంట్లు, 150 ఎంఎల్‌ డాబర్‌షాంపు బాటిల్‌, 175 ఎంఎల్‌ డాబర్‌ కొబ్బరినూనె, 50 గ్రాముల ఐటెక్స్‌ ఫ్యాన్సీ ఫౌడర్‌,100 గ్రాముల డాబర్‌ టూత్‌ పేస్ట్‌, పతంజలి టూత్‌బ్రష్‌, టంగ్‌ క్లీనర్‌, దువ్వెన, ఐటెక్స్‌ స్టిక్కర్స్‌(బొట్టుబిల్లలు) రిబ్బన్లు, ఫ్యాబ్రిక్స్‌ ఎలాస్టిక్స్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి చెందిన శానిటరీ న్యాప్‌కిన్స్‌, 180 ఎంఎల్‌ హాండ్‌ వాష్‌ ఆయిల్‌ ఉంటాయి.

కిట్స్‌ తరలింపునకు రవాణా చార్జీలు..
ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్లను ప్రభుత్వ పాఠశాలలకు, విద్యా సంస్థలకు తరలించేందుకు ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లిస్తున్నది. మండల కేంద్రం నుంచి 8 కిలోమీటర్లు దూరం ఉన్న పాఠశాలకు రూ.300, 8 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరమున్న స్కూళ్లకు రూ.600 అందిస్తున్నది.
ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ..
మండలాలకు చేరుకున్న బాలికల ఆరోగ్య కిట్లను గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా విద్యార్థినులకు కిట్లు పంపిణీ చేసేందుకు ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. పలుచోట్ల పంపిణీ శనివారం ప్రారంభమైంది. ఒక్కో మండలానికి 900 కిట్లు వచ్చాయి. ప్రస్తుతం వచ్చిన కిట్లను ఆయా పాఠశాలకు పంపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...