తెగ తాగేశారు


Mon,May 27, 2019 01:39 AM

- జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు
- గతేడాది జనవరి నుంచి మే వరకు రూ.376.80 కోట్ల అమ్మకాలు
- ఈ ఏడాది రూ.421.56 కోట్ల విక్రయాలు
- 12,50,671 కేసుల బీర్లు, 6,41,326 కాటన్ల లిక్కర్ విక్రయాలు

నిజామాబాద్ క్రైం : ప్రతి ఏడాది వేసవి కాలంలో మద్యం అమ్మకాలు జోరందుకుంటాయి. ప్రధానంగా వేసవిలో ఎండ లు జోరుగా ఉండడంతో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మందుబాబులు చల్లని బీర్లను ఆశ్రయిస్తుంటారు. దీంతో మద్యం ప్రియులతో ప్రతి ఏడాది ఆబ్కారీ శాఖ ఖజనాకు కోట్ల రూపాయల ఆదయం సమకూరుతోంది. ఈ ఏడాది ఎక్సైజ్ శాఖకు మరింత కలిసొచ్చింది. ఎండలతో పాటు వరుస ఎన్నికలు రావడంతో మద్యం అమ్మకాలు జోరు గా కొనసాగాయి. 2019 జనవరి నుంచి మే 15 వరకు జిల్లా లో రూ.421 కోట్లకు పైగానే మద్యం విక్రయాలు జరిగాయి.

ఇదీ పరిస్థితి...
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 95 వైన్స్ షాప్‌లు,16 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో 12లక్షల 50వేల 671 బీరు కేసుల విక్రయాలు జరగగా.. 6లక్షల 41వేల 326 కాటన్ల లిక్కర్ అమ్మకాలు సాగాయి. ఈ వేసవి కాలంలో ఉద యం 10 గంటల నుంచి భానుడు తన ప్రతాపం చూపడం ప్రారంభించడంతో మందుబాబులు వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని బీర్లను సేవించారు. అందు కోసం మధ్యాహ్నం 12 గంటల నుంచి మద్యం ప్రియులు బీర్లు తాగడం ప్రారంభించారు. దీంతో పాటు లిక్కర్ తాగే మందు బాబులు సైతం ఏసీ బార్లలో కూర్చొని మందు తాగారు. ఈ జనవరి నుంచి మే వరకు నాల్గున్నర నెలల కాలంలో మద్యం అమ్మకాలు రూ.421 కోట్లను మించిపోయాయి.

ఈ ఏడాది మద్యం వ్యాపారులకు పండుగ...
వరుస ఎన్నికలు మద్యం వ్యాపారులకు కలిసి వచ్చాయి. ఎంపీ ఎన్నికలు, మూడు విడతలుగా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించగా.. గ్రామాల్లో, పట్టణ కేంద్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన ఎంపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మద్యా న్ని ఎరగా వేస్తూ వచ్చారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నుంచి ప్రచారం మరింత ఊపందుకుంది. అభ్యర్థులు తమ బలాబలాలను నిరూపించుకునేందుకు ప్రజలకు మద్యాన్ని ఎరవేసి భారీ జన సమీకరణను చేశారు. అలాగే అధినేతల బహిరంగ సభలకు తరలించడానికి సైతం మద్యం పంచినట్లు తెలుస్తున్నది. ఈ మూడు నెలల పాటు జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో వైన్స్‌షాపుల్లో ఎటు చూసినా మద్యం ప్రియులే కనిపించారు. ఎన్నికల పండుగలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సొంతంగా కూడా మద్యం కోసం డబ్బు వెచ్చించారు. ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు వేర్వేరుగా విందులు ఏర్పాటు చేశాయి. ఎన్నికల రోజుల్లోనైతే కొంతమంది యువతను దాబాలకే రప్పించి విందులు ఇచ్చారు. మొత్తానికి ఎన్నికల ప్రక్రియ ఆరంభం నుంచి పోలింగ్ వరకు సాధారణం కంటే మద్యం జోరుకనిపించింది. దీంతో మద్యం వ్యాపారుల పంట పండింది.

గత నాల్గున్నర నెలల్లో మద్యం విక్రయాలు ఇలా..
- జనవరిలో 2,25,332 కేసుల బీర్లు, 1,69,138 కాటన్ల లిక్కర్ అమ్మకాల ద్వారా రూ.99.92 లక్షల ఆదాయం సమకూరింది.
- ఫిబ్రవరిలో 2,34,365 కేసుల బీర్లు, 1,40,301 కాటన్ల లిక్కర్ విక్రయాల ద్వారా రూ.88.13 లక్షల ఆదాయం సమకూరింది.
- మార్చి నెలలో 3,15,526 కేసుల బీర్లు, 1,22,158 లిక్కర్ కాటన్ల విక్రయాల ద్వారా రూ.88 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు సమకూరింది.
- ఏప్రిల్ నెలలో 3,05,019 కేసుల బీర్లు, 1,38,658 కాటన్ల లిక్కర్ల ద్వారా రూ.94.60 లక్షల ఆదాయం సమకూరింది.
- మే నెలలో 18వ తేదీ వరకు 1,70,429 కేసుల బీర్లు, 71,071 కాటన్ల లిక్కర్ విక్రయాల ద్వారా రూ.50.91 లక్షల ఆదాయం వచ్చింది.
గతేడాది జనవరి నుంచి మే వరకు రూ.376.80కోట్ల మద్యం విక్రయాలు జరుగగా.. ఈ ఏడాది జనవరి నుంచి మే 18 వరకు రూ.421.56 కోట్ల విక్రయాలు జరిగాయి. గతేడా దితో పోలిస్తే రూ.44.76కోట్ల ఆదాయం వచ్చింది.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...