వీడుతున్న చిక్కుముడులు


Mon,May 27, 2019 01:38 AM

నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో అటవీ ప్రాంతానికి ఆనుకొని ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి కూడా ఉంది. దీంతో కొందరూ భూమి లేని నిరుపేదలు ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి ఉందని భావించి కొన్నేళ్ల క్రితం కబ్జాలో ఉంటూ పంటలు సాగుచేసుకుంటున్నారు. ఈ విధంగా నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం, మల్కాపూర్ తండా, కొత్తపేట తదితర గ్రామాల్లో భూమి కబ్జాలో ఉండి పంటలు పండించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు భూమికి సంబంధించిన పాస్‌బుక్‌లు ఇవ్వాలని ఆ నిరుపేదలు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో అటవీ అధికారులు కూడా స్పందించి కబ్జాలో ఉంటున్న భూములు అటవీ పరిధిలో ఉన్నందున వారికి పాస్‌బుక్‌లు ఇవ్వకూడదని రెవెన్యూ అధికారులకు సూచించారు. దీంతో భూమి కబ్జాదారులకు పాస్‌బుక్‌లు ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు కాలయాపన చేసే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఎన్నో ఏళ్లుగా భూముల్లో కబ్జాలో ఉండి పంటలు పండించుకుంటున్న పేదలకు (పోడు భూములకు) పట్టాలు, పాస్‌బుక్‌లు ఇవ్వడంతో పాటు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి సహాయం అందించేందుకు తగు చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిప్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ అటవీ, రెవెన్యూ, ల్యాండ్ రికార్డుల శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అటవీ భూమికి ఆనుకొని ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి కూడా ఉన్నందున ఈ రెండింటి భూముల సరిహద్దులు తేల్చటానికి ఆ మూడు శాఖల అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తూ ఆదేశాలిచ్చారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు ఆదేశాల మేరకు నిజామాబాద్ రూరల్ మండల తహసీల్దార్ జ్వాలాగిరి రావు, సర్వేయర్ స్వప్న, ఆర్‌ఐ సంతోష్‌కుమార్, అటవీ రేంజ్ ఆఫీసర్ పద్మారావు, సెక్షన్ ఆఫీసర్లు భాస్కర్, ప్రతాప్, వీఆర్వోలు స్రవంతి, ఆశన్న, విజయ్‌కుమార్‌తో ముందుగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ భూమి, ప్రభుత్వ అసైన్‌మెంట్ భూముల సరిహద్దు నిర్ధారణ కోసం సర్వే ప్రక్రియ గురించి చర్చించారు. అనంతరం ఏప్రిల్ 15వ తేదీన అధికారులు జాయింట్ సర్వేను ప్రారంభించారు. ఇప్పటివరకు మల్లారం, ధర్మారం(ఎం), మల్కాపూర్ తండా, కొత్తపేట్, ముత్తకుంట గ్రామాల శివారులో ఉన్న అటవీ భూమి సరిహద్దును అధికారులు నిర్ధారించారు. మల్లారం శివారులో 422, 423 సర్వే నంబర్లలో ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి ఉంది. దీనికి ఆనుకొని అటవీ భూమి ఉంది. 420 సర్వేనంబర్‌లో 3,039 ఎకరాల 38గుంటల భూమిని అటవీ భూమి కింద గుర్తించారు. అదేవిధంగా 396 సర్వే నంబర్‌లో 1,232 ఎకరాల 23 గుంటల భూమి అటవీ భూమిగా నిర్ధారించారు. 579 సర్వేనంబర్‌లో 40 ఎకరాల 20 గుంటల భూమి అటవీ పరిధిలో ఉందని తేల్చారు. ధర్మారం(ఎం)లో 324 సర్వే నంబర్‌లో 1,749 ఎకరాల 12గుంటలు, ముత్తకుంటలో 26 సర్వే నంబర్‌లో అటవీ భూమిగా గుర్తించారు. అదే విధంగా 48 సర్వే నంబర్‌లో ఉన్న భూమిని ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమిగా గుర్తించారు. మల్కాపూర్ తండాలో 180, 181, 182 సర్వే నంబర్లలో ఉన్న భూమిని అటవీ భూమిగా నిర్ధారించారు. ఇదే గ్రామంలో 179 సర్వే నంబర్ భూమిని సర్వే చేయాల్సి ఉంది.

ఇంకనూ సర్వే చేయాల్సిన గ్రామాలు ...
మల్కాపూర్ తండాలో 179 సర్వే నంబర్ భూమిని, సిర్పూర్, సారంగాపూర్ శివార్లలో ఉన్న భూములను సర్వే చేయాల్సి ఉంది. ఏప్రిల్ 15న ప్రారంభించిన జాయింట్ సర్వే అటవీ భూమి నిర్ధారణ సర్వే మే 15వరకు ముగించాల్సి ఉండగా.. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో సర్వేకు ఆటంకం కలిగింది. మళ్లీ తిరిగి ఈనెల 27 నుంచి జాయింట్ సర్వేను పునఃప్రారంభించనున్నారు. సర్వే నిర్వహించడంతో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసే విషయమై స్పష్టత ఏర్పడుతుంది. సర్వే పూర్తయిన అనంతరం అటవీ భూమి ఎంత ఉందనేది అటవీశాఖ అధికారులు, ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి ఎంత ఉందనేది రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తయారుచేసిన నివేదికలు జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తారు. అటవీ భూమిగా గుర్తించిన పరిధిలో ట్రెంచ్ కటింగ్ ఏర్పాటు చేసేందుకు అటవీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

త్వరలో సర్వే పూర్తి ..
అటవీభూమి సరిహద్దు నిర్ధారణ కోసం రెవెన్యూ, అ టవీశాఖల సం యుక్త ఆధ్వర్యం లో జరుగుతున్న సర్వే ప్రస్తుతం కొ నసాగుతున్నది. త్వరలోనే సర్వే ప్రక్రియను పూర్తి చేస్తాము. భూముల సరిహద్దులను గుర్తించి చుట్టూ ట్రెంచింగ్ ఏర్పాటు చేయడంతో ఆ భూములు కబ్జాకు గురయ్యే అవకాశం ఉండబోదు.
- జ్వాలాగిరిరావు, తహసీల్దార్, నిజామాబాద్ రూరల్ మండలం

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...