పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్..


Thu,May 23, 2019 01:30 AM

-జిల్లాకు 6,90,600 పుస్తకాలకు 6,65,100 సరఫరా
-కొనసాగుతున్న పంపిణీ ప్రక్రియ
-ఇప్పటి వరకు 2,53,471 పుస్తకాలు పంపిణీ
-విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలకు చేరవేత

ఇందూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందేవి కావు. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఐదారు నెలల తర్వాత పుస్తకాలు అందేవి. అప్పటికి సగం విద్యా సంవత్సరం పూర్తయి విద్యార్థులు నష్టపోయేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అలాంటి వాటికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెక్‌పెట్టింది. వేసవి సెలవుల్లోనే జిల్లాలకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తున్నది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలకు పుస్తకాలు చేరేలా చర్యలు చేపట్టింది. దీంతో కొన్నేండ్లుగా స్కూళ్లు ప్రారంభంలోనే విద్యార్థులకు ఉపాధ్యాయులర పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నారు. తద్వారా విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.

ఈ ఏడాది..
2019-20 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలోని మొత్తం 1216 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించి పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. ఆయా మండలాలకు విద్యశాఖ అధికారులు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు 6,90,600 పుస్తకాలు రావాల్సి ఉండగా.. 6,65,100 పుస్తకాలు చేరాయి. జిల్లాలోని 13 మండలాల్లోని ఆయా పాఠశాలలకు 2,53,471 పుస్తకాలను పంపిణీ చేసినట్లు జిల్లా పాఠ్య పుస్తకాల పంపిణీ అధికారులు తెలిపారు. గతేడాది పుస్తకాలు కలుపుకుని గ్రౌండ్ బ్యాలెన్స్ మొత్తం 73,350 పుస్తకాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జిల్లాకు 25,500 పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, మాక్లూర్, నందిపేట్, వర్ని, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి మండలాలకు పుస్తకాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫస్ట్ క్లాస్ తెలుగు, మ్యాథ్స్, మ్యాథ్స్ వర్క్ బుక్, తెలుగు, ఐదో తరగతి ఇంగ్ల్లిష్, మ్యాథ్స్, ఎనిమిదో తరగతి తెలుగు, ఫిజికల్ సైన్స్, ఇంగ్ల్లిష్, సోషల్ స్టడీస్, పదోతరగతి తెలుగు రీడర్(సెకండ్ లాంగ్వేజ్), ఉర్దూ మీడియానికి సంబంధించి పలు పుస్తకాలు రావాల్సి ఉంది. వీటితో మిగతా తరగతులకు సంబంధించి పలు పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. మిగతా మండలాలకు సంబంధించి పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అక్రమాలకు చెక్..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. గతంలో పుస్తకాలు విచ్చలవిడిగా అమ్ముకోవడం, వారి బంధువులకు ఇవ్వడం వంటివి జరిగేవి. దీంతో పేద విద్యార్థులకు పుస్తకాలు అందకుండా పోయేవి. గతంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికారులతో కుమ్మక్కై తక్కువ ధరకు పుస్తకాలను కొనుగోలు చేసి తమ పాఠశాలలో ఎక్కువ రేటుకు అమ్మేవారు. గతంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం జిల్లాలో చదువుతున్న ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఎమ్మార్సీ నుంచి ఆయా మండలాల్లోని హెచ్‌ఎంలకు పంపిణీ చేస్తున్నారు.

విద్యార్థులకు అందించే పుస్తకాలపై కోడ్ నంబర్లు నమోదు చేసి, మళ్లీ ఆ కోడ్ నంబర్లనే ఎమ్మార్సీలో నమోదు చేస్తారు. దీంతో విద్యార్థులు సంవత్సరం పొడవునా పుస్తకాలను భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పుస్తకాలు పోతే దాని బాధ్యత పాఠశాల హెచ్‌ఎం, విద్యార్థిదే. దీంతో విద్యార్థుల పుస్తకాలు ఒకరిది మరొకరు తీసుకోవడానికి వీలు ఉండదు. విద్యార్థులకు ఇచ్చిన పుస్తకాలు ఇతరులకు ఇవ్వడానికి వీలు ఉండదు. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కోడ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నిర్ణయంతో పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...