ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి


Thu,May 23, 2019 01:28 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో కౌంటింగ్ ఏర్పాట్లపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీపడినట్లు తెలిపారు. లెక్కింపు ప్రక్రియ నిర్ణీత సమయానికి పూర్తి చేయడానికి 36 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా యంత్రాంగం పంపిన ప్రతిపాదనలకు ఎన్నికల కమిషన్ ఆమోదించిందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. బందోబస్తుకు సంబంధించి పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని, కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ, నియామకం పూర్తి చేశామన్నారు. మిగతా నియోజకవర్గాల మాదిరిగా నిజామాబాద్ స్థానం ఫలితం నిర్ణీత సమయంలో వచ్చే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున మొదటి రౌండ్ ఫలితం సుమారు రెండున్నర గంటలు పట్టవచ్చని, అభ్యర్థులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. లెక్కింపు సందర్భంగా కచ్చితంగా విధులు నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని తెలిపారు. సిబ్బంది, అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని తేడా వస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఉదయం ఆరు గంటలకే స్ట్రాంగ్ రూమ్‌లను తెరుస్తాం...
గురువారం ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను తెరుస్తామని కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని తెలిపారు. 7.59 గంటలకు వరకు వచ్చే పోస్టల్ బ్యాలెట్‌లను స్వీకరిస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఎవరిని కూడా సెల్‌ఫోన్లతో అనుమతించామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఏ నంబర్ టేబుల్ కేటాయిస్తే, అక్కడే ప్రక్రియకు హాజరు కావాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు కానీ, వారి ఎన్నికల ఏజెంట్ కానీ ఎవరో ఒకరిని ఏఆర్వో టేబుల్ వరకు అనుమతిస్తామని తెలిపారు. లోపలికా రావాలంటే అనుమతి పాస్‌లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ హాల్‌కు పద్దెనిమిది టేబుళ్ల చొప్పున రెండు హాళ్లలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లను లెక్కిస్తారని, ఈవీఎంలను ఒక క్రమ పద్ధతిలో, క్రమసంఖ్యలో కౌంటింగ్ టేబుళ్లకు అందిస్తామన్నారు.

నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎనిమిది రౌండ్లు, బోధన్, బాల్కొండ ఏడు, ఆర్మూర్ ఆరు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేస్తామని తెలిపారు. వీటి లెక్కింపు తర్వాత డ్రా ద్వారా తీసిన వీవీప్యాట్లల లెక్కింపు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు చొప్పున ,ఒకటి తర్వాత ఒకటి లెక్కిస్తారని, వీటికి సుమారు 5 రౌండ్ల సమయం పడుతుందన్నారు. లెక్కింపు హాళ్లలో ఏఆర్వోలకు పూర్తి అధికారులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ కూడా ఓటింగ్ గోపత్యను పాటించాలన్నారు. రౌండ్ల వారీగా వచ్చిన ఫలితాలను ఎన్నికల పరిశీలకులు చూసి సంతృప్తి చెందిన తర్వాతనే ప్రకటిస్తామని తెలిపారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...