4 నుంచి బడిబాట షురూ..


Tue,May 21, 2019 01:07 AM

-జూన్‌ 12 వరకు నిర్వహణ
-ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-ఒకటిన పాఠశాలల పునః ప్రారంభం
-ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యం
ఇందూరు : 2019-20 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలు జూన్‌ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా జూన్‌ 4 నుంచి 12 వరకు బడిబాట కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బడి ఈడు పిల్లలను చేర్పించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. బడి బాట నిర్వహణ ఖర్చుల కోసం పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున అందించనున్నారు. జూన్‌ 1 నుంచి 3వ తేదీ వరకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను జిల్లా విద్యా శాఖ అధికారులు, సిబ్బంది కసరత్తు ప్రారంభించారు. ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, బోధనా విధానం, మధ్యాహ్న భోజనం వంటి అంశాలను పిల్లల తల్లిదండ్రులకు వివరించేలా ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధమవుతున్నారు. ఇటీవల పది పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించగా.. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం..
జిల్లాలో మొత్తం 1,216 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. జూన్‌ 4 నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొదటి రోజు మన ఊరి బడి, 7న బాలికల విద్య, 10న అక్షరాభ్యాసం, 11న హరితహారం, స్వచ్ఛపాఠశాల, 12న బాలకార్మికుల విముక్తి వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. బడిబయట పిల్లలను గుర్తించి వారికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యాక ఉపాధ్యాయులు తొమ్మిది రోజుల పాటు బడి బాట కార్యక్రమంలో పాల్గొననున్నారు. గత ఏడాది 142 మంది పిల్లలను బడి బాటలో భాగంగా పాఠశాలల్లో చేర్పించగా.. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెంచేలా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఆదర్శంగా తీసుకుంటే అద్భుత ఫలితాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్‌ 4 నుంచి 12 వరకు బడి బాట కొనసాగనుంది. కాగా.. ప్రతి ఏడాది పాఠశాలల ప్రారంభానికి ముందు ఈ ప్రక్రియ చేపడుతున్నారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో వేసవిలో బడిబాట కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆయా గ్రామాల సర్పంచుల సహకారంతో ఇంటింటికీ తిరుగుతూ 2019-20 విద్యాసంవత్సరానికి కొత్తగా విద్యార్థులను చేర్పిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి వేసవిలో బడిబాటకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రైవేటు పాఠశాలలు తమ పాఠశాలల్లో చేరాలని ప్రతి ఏడాది వేసవిలో ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. వినూత్నంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం వేసవిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ప్రచారం చేయడం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన వచ్చింది.

దీంతో ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మన జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఇలాంటి ప్రయత్నం జరిగితే మంచి ఫలితాలు సాధించవచ్చనడంలో సందేహం లేదు. ప్రభుత్వ పాఠశాలలు జూన్‌ 1న ప్రారంభం కానుండడంతో.. ఇంకా 11 రోజుల సమయం ఉంది. ఈ ప్రక్రియను జిల్లాలో అమలు పరిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారనే ప్రచారం క్షేత్ర స్థాయిలో చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్యను మరింత పెంచొచ్చు. ఆ దిశగా జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...