కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు


Mon,May 20, 2019 03:18 AM

-18 టేబుళ్లు ఏర్పాటు చేశాం
-ఓటింగ్ గోప్యతను ప్రతి ఒక్కరూ పాటించాలి
-విలేకరుల సమావేశంలో కలెక్టర్ రామ్మోహన్‌రావు
నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఈనెల 23న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. లెక్కింపునకు సంబంధించి ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో పాటు మీడియా సహకారంతో విజయవంతం చేశామని, అందు కు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23న నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 185 మంది అభ్యర్థులు పోటీచేశారని, నోటా ఉన్నందున కౌంటింగ్‌కు ఎక్కువ గంటల సమ యం తీసుకోనుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ పూర్తి చేస్తామన్నారు.

18 టేబుళ్లు ఏర్పాట్లు...
కౌంటింగ్‌కు రౌండ్‌ల వారీగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుత ఆదేశాల ప్రకారం 18 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. 36 టేబుళ్లను ఏర్పాటు చేయడానికి ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు సమర్పించామని, ఆదేశాలు వస్తే అందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. జగిత్యాల జిల్లాలో రెండింటికీ, మిగతా అయిందింటికి నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి సీఎంసీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 18 టేబుళ్లలతో పాటు రిటర్నింగ్ అధికారికి ఒక టేబుల్ ఏర్పాటు చేస్తామని, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఆర్వో, ఏఆర్వోగా వ్యవహరిస్తారని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు వారి ఏజెంట్లకు పాసుల కోసం ఫారం-18 ద్వారా ఆయనకు కౌంటింగ్‌కు మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు అధికంగా ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల్లోకి గుర్తింపు పొందిన పార్టీల ఏజెంట్లకు ప్రాధాన్యతనిస్తూ, మిగతా ఏజెంట్లకు రొటేషన్‌లో అనుమతిస్తామని చెప్పారు. ఈవీఎంల కౌంటింగ్‌కు ముందు ఈటీపీ బీఎస్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ముందుగా లెక్కిస్తామన్నారు.

గోపత్యను పాటించాలి...
ఓటింగ్ గోపత్యను ప్రతి ఒక్కరూ పాటించాలని, అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కలెక్టర్ రామ్మోహన్‌రావు అన్నారు. ఏ ఒక్కరికి కూడా కౌం టింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతి లేదన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ర్యాండమ్‌గా వీవీప్యాట్ల ఓట్లను లెక్కిస్తామని, ఇది ఓట్ల లెక్కింపు అనంతరం ఉంటుందన్నారు.

వీవీప్యాట్‌లలో లెక్కింపు బ్యాంకులో కౌంటర్ లాగా ఏర్పాటు చేసి జాగ్రత్తగా లెక్కించడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే ఒకసారి శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. లెక్కింపునకు సంబంధించి యంత్రాంగానికి పూర్తిగా అవగాహన ఏర్పడిందన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...